Home Page SliderNews AlertTelanganatelangana,Trending Todayviral

కోతులకు తంటా తెచ్చిన ‘మిస్ వరల్డ్ బ్యూటీస్’..

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల సందర్భంగా దేశదేశాల నుండి అనేకమంది ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి కోసం చక్కటి స్వాగత సత్కారాలతో పాటు మంచి ఆతిథ్యం ఏర్పాటు చేస్తోంది. అంతేకాక తెలంగాణలో ప్రసిద్ధ ప్రదేశాల సందర్శన కూడా ఏర్పాటు చేసింది. ఇదే కోతులకు తంటా తీసుకొచ్చింది. అవి స్వేచ్ఛగా సంచరించే ప్రదేశాల నుండి వాటిని తరలిస్తున్నారు. మిస్ వరల్డ్ సుందరీమణులు సందర్శించే ప్రదేశాల్లో భద్రతా చర్యలను చేపడుతోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో.. వాటి నుంచి వాళ్లను రక్షించేందుకు ‘ఆపరేషన్ మంకీస్‌’ను ప్రభుత్వం చేపట్టింది. వాటిని అక్కడి నుంచి సురక్షితంగా మరో ప్రాంతానికి తరలిస్తోంది. 14వ తేదీన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పర్యటన ప్రదేశాల సందర్శనకు ప్లాన్ చేశారు.. వీటిలో యునెస్కో గుర్తింపుపొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, హనుమకొండ లోని వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, ఫోర్ట్ వరంగల్ సందర్శనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కోతుల బెడద నుండి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ‘ఆపరేషన్ మంకీస్’ పేరుతో రామప్ప పరిసరాల్లో సంచరిస్తున్న కోతులను వలవేసి పట్టుకొని వాటిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 200లకు పైగా కోతులను పట్టుకొని బోన్‌లలో పట్టి  తీసుకెళ్లి ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో వదిలేశారు.