మిరాకిల్.. 103 సార్లు పాములు కాటు వేసినా బతికిన వ్యక్తి
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. సుబ్రమణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు.. అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై.. ఆసుపత్రి పాలై చికిత్స పొందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తాజాగా నాలుగు రోజుల క్రితం పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇదో మిరాకిల్ అంటూ వైద్యులే షాకవుతున్నారు. 18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసము ఉంటూ తొలిసారి పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం.. అతనిపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 103 సార్లు పాము కాట్లకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్సలకు లక్షల్లో ఖర్చు పెట్టాడు. తనకున్న మూడెకరాలు పొలం కాస్తా ఇప్పుడు రెండెకరాలకు చేరింది. ఆస్తులు విక్రయించి, అప్పులు చేసి ఇలా పాముకాట్ల నుంచి బయటపడుతున్నాడు. సుబ్రహ్మణ్యంను రైతులెవరూ కూలి పనులకు సైతం పిలవడం లేదు. కూలి పనులు చేస్తున్నప్పుడు పాము కాటేస్తే తాము బాధ్యలమవుతామనే భయమే దీనికి కారణం. తనను ప్రభుత్వమే మా కుటుంబాన్ని ఆదుకోవాలని.. లేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశాడు సుబ్రహ్మణ్యం.