Home Page SliderInternational

తాలిబన్లకు ఇండియా తెలిసేలా విదేశాంగ శాఖ కార్యక్రమం

భారతదేశం గురించి లోతైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలు కలిగించే కోర్సుకు ఆన్ లైన్ ద్వారా హాజరవ్వాల్సిందిగా… తాలిబన్ ప్రభుత్వానికి, విదేశాంగ శాఖ ఆహ్వానం పంపింది. నాలుగు రోజుల పాటు ఐఐఎం నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరింది. పౌర ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత, ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్ సర్కారును భారత ప్రభుత్వం నేటికీ గుర్తించలేదు. అయితే ప్రస్తుతం ఆ దేశంతో ఇండియా స్నేహాన్ని కోరుకుంటోంది. భారత్ నిర్వహిస్తున్న ఆన్ ‌లైన్ కోర్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అతిథులు భాగస్వాములవుతారు. కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ద్వారా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కోర్సును నిర్వహిస్తోంది.

ఈ కోర్సు ద్వారా ప్రపంచదేశాలకు భారతదేశ ప్రత్యేకతను వివరిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం ఎలా పనిచేస్తుందో చెప్తారు. బయట దేశాల్లో ఉన్నవారిలోని అనుమానాలను నివృత్తి చేస్తారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వాతావరణం, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా, విదేశీయులకు ఇండియాపై ఒక అవగాహన, అభిప్రాయానికి రావడానికి వీలు కలుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనేవారు భారతదేశ ఆర్థిక వాతావరణం, వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక వారసత్వం, సామాజిక నేపథ్యాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తోంది. సామాజిక, చారిత్రక నేపథ్యం, ​​సాంస్కృతిక వారసత్వం, చట్టపరమైన, పర్యావరణ ప్రకృతి దృశ్యం, వినియోగదారుల ఆలోచనలు, వ్యాపారంలో లాభ నష్టాలను తెలుసుకోడానికి వీలుకలుగుతుంది.

ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యేందుకు అవకాశం ఉన్నందున కాబూల్ నుండి చాలా మంది ఈ కోర్సులో భాగస్వాములవుతున్నట్టు తెలుస్తోంది. ఇండియాకు రావాల్సిన అవసరం లేకుండానే సదస్సులో పాల్గొనవచ్చు. తాలిబాన్‌లను ఒంటరిగా ఉంచడం కంటే… వారికి ఇండియాపై అవగాహన కల్పించడం మంచిదని అధికారులు చెప్పారు. తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ ‘దరి’ సర్క్యులర్ ద్వారా సమాచారాన్ని విదేశాంగ శాఖ పంపించింది. ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాలిబాన్ స్వాధీనం చేసుకున్న 10 నెలల తర్వాత, జూలై 2022లో కాబూల్‌లో భారతదేశం రాయబార కార్యాలయాన్ని సాంకేతికంగా ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇది మానవతా సాయంగా పేర్కొంది.