‘ట్రోలింగ్’ కారణంగా కన్నీరుమున్నీరైన మంత్రి కొండా సురేఖ
తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు మంత్రి కొండా సురేఖ. మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళలపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రమైన ట్రోలింగులు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో జరిగిన చేనేత కార్మికుల సమావేశంలో రఘునందన్ రావు తనకు ఒక నూలుదండను వేస్తే, దానిని బీఆర్‌ఎస్ పార్టీ ట్రోలింగ్‌కు ఉపయోగించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివెనుక బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయం తెలిసి రఘునందన్ రావు ‘అక్కా నేను చేసిన పని వల్ల నీకు అవమానం జరిగింది క్షమించు’ అంటూ ఫోన్ కూడా చేశారన్నారు. నిన్నటి నుండి తాను అవమానంతో భోజనం కూడా చేయలేదని బాధపడ్డారు. తనకు దండ వేసినంతమాత్రాన ఆ ఫోటోలు పెట్టి ‘షాదీముబారక్’ అంటూ నీచమైన ట్రోలింగ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మహిళల పట్ల ఇలాంటి అసభ్య ప్రచారం చాలా హీనంగా ఉందన్నారు. అక్కాతమ్ముళ్ల లాంటి మా మధ్య ఇలాంటి కామెంట్లు పెట్టడం ఎంతవరకూ కరెక్టో వారి ఇంటిలో ఆడవాళ్లను అడగమన్నారు. ఈ విషయాన్ని స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని, తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని, వారిని వదిలిపెట్టేది లేదన్నారు.