NewsTelangana

జనవరి నుంచి మెట్రో చార్జీల బాదుడు..!

హైదరాబాద్‌ మెట్రో రైలు చార్జీలను జనవరి నెల నుంచి పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. చార్జీలను ఇప్పుడు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచడానికి వీల్లేదు. దీంతో భారీగా పెంచి రాయితీలు ఇవ్వాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌-ప్రైవేటు పార్టనర్‌ షిప్‌ విధానంలో ప్రారంభించిన హైదరాబాద్‌ మెట్రో రైలును నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థే నడుపుతోంది. ఎల్‌ అండ్‌ టీ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో రైలు చార్జీలను పెంచే అధికారం రైలు సర్వీసుల ప్రారంభంలో మాత్రమే ఉంది. ఇప్పుడు చార్జీలు పెంచే అధికారం ముగ్గురు సభ్యుల కమిటీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ నిర్ణాయక కమిటీ మెట్రో చార్జీల పెంపుదలపై ప్రజల సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించింది.

చార్జీలు భారీగా పెంచే ప్లాన్‌..

ఇప్పటికే పలు సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీల నుంచి కమిటీకి పోస్ట్‌, మెయిల్‌ ద్వారా లేఖలు అందాయి. మంగళవారం గడువు ముగిసిన తర్వాత వీటిని కమిటీ ముందు తెరుస్తారు. త్రిసభ్య కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి ఒక స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయిస్తుంది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసి చార్జీలు ఎంత పెంచాలో నిర్ణయిస్తుంది. హైదరాబాద్‌ మెట్రోలో ప్రస్తుతం కనిష్ట ధర రూ.10. గరిష్టగా రూ.60 వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు 2017లో మెట్రో సర్వీసులను ప్రారంభించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఎల్‌ అండ్‌ టీ నిర్ణయించింది. అప్పుడే చార్జీలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ చార్జీలు పెంచడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.