తెలంగాణలో బీసీ సీఎం ఉంటే బావుంటుందని బీజేపీతో కలిశా: పవన్
తెలంగాణ తనకు ఎంతో బలాన్ని, శక్తిని ఇచ్చిందని, అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా హనుమకొండలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. నా పోరాటానికి తెలంగాణ యువత అండగా నిలుస్తోందని అన్నారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతా. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధించి చూపెడతా. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీ పెట్టాను, నడుపుతున్నాను. బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధేస్తోంది. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని బీజేపీ పార్టీతో కలిశాను. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో నేనూ ఒకడిని. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తా. కమలం గుర్తుపై ఓటువేసి.. రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్‌ను గెలిపించాలని ఓటర్లకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

