Home Page SliderTelangana

కేసీఆర్, కేటీఆర్, కవితలకు బీజేపీ ఇచ్చే పదవులివేనంటున్న రేవంత్

త్వరలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని, మాజీ సిఎం, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు గవర్నర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని, కుమారుడు కేటీఆర్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బెర్త్ ఇస్తారని, తెలంగాణ అసెంబ్లీలో మేనల్లుడు టి హరీష్‌రావు ప్రతిపక్ష నేతగా ఎన్నికవుతారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు విలీనాన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ చివరికి అది జరగక తప్పదన్నారు.
బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అవుతారని రేవంత్ చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్‌ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె కె.కవితను జైలు నుంచి బెయిల్‌పై విడుదల చేసిన తర్వాత రాజ్యసభకు పంపే అవకాశం ఉందని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం కాంగ్రెస్ ఎక్కువగా చేస్తోంది. ఇప్పటికే 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరగా, రానున్న కాలంలో గులాబీ పార్టీ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.

అయితే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ విలీన వాదనను కొట్టిపారేశారు. అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే తన సోదరి కవిత 150 రోజులకు పైగా జైలులో ఉండేదా అని ప్రశ్నించారు. తన అమెరికా పర్యటనలో పార్టీలు తన సోదరులను వివాదాల్లోకి లాగాయని సీఎం రేవంత్ విమర్శించారు. “నాకు ఏడుగురు అన్నదమ్ములున్నారు. నేను ముఖ్యమంత్రిని అయినంత మాత్రాన వాళ్ళు ఇంట్లో కూర్చుంటారా?” అని అడిగారు. వ్యవసాయ రుణమాఫీపై BRS విమర్శలను రేవంత్ కొట్టిపారేశారు. “పంట రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు రిజర్వ్ చేసిందని, అర్హత ఉన్నప్పటికీ ప్రయోజనం పొందని వారు జిల్లా కలెక్టరేట్ దృష్టికి తీసుకురావాలని రేవంత్ అన్నారు. ఒక కుటుంబానికి 2 లక్షలకు మించి రుణాలు ఉంటే, వాటిని ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు, మాఫీ 2 లక్షల వరకు మాత్రమే వర్తిస్తుందని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దాదాపు ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.