Home Page SliderNationalSports

మహిళల ప్రీమియర్ లీగ్‌కు మెంటర్స్ సిద్ధం – ఇక ఆటకు సై

మహిళా క్రికెట్‌ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా మార్చి 4న ప్రారంభం కాబోతోంది. ఫ్రాంచైజీలు తమ జట్టు క్రీడాకారుణులకు స్ఫూర్తిని నింపే ఉద్దేశ్యంతో మెంటర్లను నియమించాయి. అన్ని టీమ్‌లు క్రికెటర్లనే నియమించగా, బెంగళూర్ ఫ్రాంచైజీ తమ మెంటర్‌గా గ్లామర్ టెన్నిస్ స్టార్ సానియామీర్జాను ఎంపిక చేసి జట్టులో ఉత్సాహాన్ని నింపింది. బెంగళూరుతో పాటు గుజరాత్, ముంబయి,యూపీ  కూడా మహిళలనే మెంటర్స్‌గా నియమించింది.

బెంగళూరు జట్టులో స్మృతి మంధాన, ఎలిస్ పెర్రీ వంటి క్రికెటర్లు ఉన్నారు. వీరికి సానియా కూడా జత కలిసి జట్టును కలర్‌ఫుల్‌గా మార్చింది. ఇటీవలే టెన్నిస్‌ నుండి రిటైర్ అయిన సానియా అనుభవాన్ని ఆర్‌సీబీ వినియోగించుకోవాలనుకుంటోంది. సానియా కూడా ఆర్‌సీబీ  మహిళా జట్టుతో కలవడం చాలా సంతోషంగా ఉందని, చాలా ఉత్సాహంగా ఈ బాధ్యతలను నిర్వహించడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొంది. మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా ఉమెన్స్ క్రికెట్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

గుజరాత్ మెంటర్‌గా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్. ఆమె 23 ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్‌కు సేవలందించింది. మహిళా క్రికెట్‌లో ‘ఉమెన్ ప్రీమియర్ లీగ్’ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది మిథాలీ. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి పనిచేయడం చాలా సంతోషమని, జట్టులో బలమైన పునాదులు నిర్మిస్తానని హామీ ఇచ్చింది.

మిథాలీ తర్వాత భారత మహిళా క్రికెట్‌లో పాపులారిటీ పొందిన క్రికెటర్ జులన్ గోస్వామిని ముంబయి ఇండియన్స్ చేజిక్కించుకుంది. ఆమె టీం ఇండియాలో 20 ఏళ్ళకు పైగా ఆడింది. వన్డేలు, ప్రపంచకప్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరుపొందింది. ఆమె కూడా గత సంవత్సరమే రిటైర్‌మెంట్ ప్రకటించింది. జులన్ ఇప్పుడు ముంబయి కోచ్‌గా, బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించనుంది. ఈ జట్టులో నటాలీ స్కివర్‌, పూజా వస్త్రాకర్, హర్మన్ ప్రీత్ కౌర్, యాస్తికా భాటియా వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు.

ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన లీసా స్థలేకర్ భారత సంతతికి చెందినదే. అయితే ఆస్ట్రేలియా జంట తనను దత్తత తీసుకోవడంతో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌గా రాణించింది. ఆస్ట్రేలియా సాధించిన ప్రపంచ కప్పులో కెప్టెన్‌గా వ్యవహరించింది. దాదాపు 4 వేల పరుగులు సాధించి, 230 వికెట్లను పడగొట్టింది. అందుకే యూపీ తమ జట్టుకు లీసాను మెంటర్‌గా ఎంచుకుంది.