భూవివాదంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాణాలు ఆపేయాలన్న హైకోర్టు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన భూ వివాదంపై తెలంగాణ హైకోర్టు మెగాస్టార్ చిరంజీవికి నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తీర్పునిచ్చిన కోర్టు.. నిర్మాణ కార్యకలాపాలకు నిలిపివేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ప్రజా అవసరాల కోసం ఉన్న భూమిని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించింది. నిబంధనలకు విరుద్ధంగా భూమిని విక్రయించారని పిటిషనర్ శ్రీకాంత్ బాబు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ప్లాష్ ఏరియాలో నివాసముంటున్న చిరంజీవికి అదే ప్రాంతంలో ఇతర భూములు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం జె శ్రీకాంత్ బాబు అనే వ్యక్తి, అదే భూమికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే, చిరంజీవి ఇటీవల జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ప్లాష్ ఏరియాలో 595 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రజా వినియోగానికి ఉద్దేశించిన ఈ భూమిని సొసైటీ అక్రమంగా విక్రయించింది.

దీంతో శ్రీకాంత్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తర్వాత ఆదేశాలు వచ్చే వరకు వివాదాస్పద స్థలంలో నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని హైకోర్టు చిరంజీవిని ఆదేశించింది. ఇప్పటికే ఈ నిర్మాణంపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలు వేసుకున్న చిరంజీవికి ఇది ఎదురుదెబ్బే. మొత్తం వ్యవహారంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జీహెచ్‌ఎంసీకి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను ఏప్రిల్ 25న వాయిదా వేసింది.