ఆంధ్రప్రదేశ్ లోని 4 గ్రామీణ బ్యాంకులు మెగా విలీనం
భారత ప్రభుత్వం 2025 మే 1 నుండి “ఒక రాష్ట్రం, ఒకే RRB” అనే విధానాన్నిఅమలులోకి తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం ప్రతీ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకులను విలీనం చేయబోతున్నారు. ఇప్పటికే విలీన ప్రక్రియలు పలు రాష్ట్రాలలో ప్రారంభం అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 గ్రామీణ బ్యాంకులు విలీనం చెంది ఒకే బ్యాంక్ గా ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. ఈ మేరకు విలీన ప్రక్రియలో భాగంగా.. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనుసంధానం కోసం దాదాపు 5 రోజుల పాటు చాలా వరకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి.. అక్టోబర్ 13 ఉదయం 10 గంటల వరకు.. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుల సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.’ అని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ లో పేర్కొంది. బ్యాంక్ బ్రాంచ్‌లతో పాటు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఏటీఎం సేవలు, బ్యాంక్ మిత్రలు కూడా అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది. ఇక్కడ అక్టోబర్ 11 రెండో శనివారం, 12 ఆదివారం బ్యాంకులకు సెలవు. అంతేకాక ఈ రోజుల్లో విలీన ప్రక్రియ కారణంగా ఆన్ లైన్ సేవలు, ఏటీఎం సేవలు కూడా పొందలేరు. అందుకని కస్టమర్లు తమ బ్యాంకింగ్ సేవలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. విలీనం అనంతరం కస్టమర్లకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తామని వెల్లడించారు.