క్రీడాకారిణులకు టాయ్‌లెట్‌లో భోజనాలు..!
ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారిణులకు అధికారులు మరుగుదొడ్డిలో భోజనం వడ్డించారు. సహరన్‌పూర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీన అండర్-17 కబడ్డీ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారిణులు వచ్చారు. ఆ క్రీడాకారిణుల కోసం సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద వంటకాలు చేశారు. పూరీలను మాత్రం టాయ్‌లెట్‌లోనే చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.

భోజనాలు వడ్డించే నాథుడే లేడు..
క్రీడాకారిణులకు వడ్డించేందుకు అన్నం, పప్పు, కూరల పాత్రలను కూడా టాయ్‌లెట్ వద్దే ఉంచారు. పూరీలను టాయ్‌లెట్‌లోని నేలపై ఓ పేపర్‌పై పడేయడం దారుణం. భోజనం చేసేందుకు వచ్చిన క్రీడాకారిణులకు వడ్డించే నాథుడే లేడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో క్రీడాకారిణులే టాయ్‌లెట్‌లోకి వెళ్లి ఎవరికి వారే భోజనం వడ్డించుకున్నారు. సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్దకెళ్లి భోజనం చేశారు.

జిల్లా క్రీడాధికారిపై వేటు..
ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. దీంతో అధికారులు స్పందించారు. స్టేడియం వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. పైగా వర్షం పడుతోందని.. అందుకే స్విమ్మింగ్ పూల్ వద్దే వంటలు చేయించామని షాహారన్‌పూర్ క్రీడాధికారి అనిమేష్ సక్సేనా వివరణ ఇచ్చారు. ఆహారాన్ని బట్టలు మార్చుకునే గదిలో భద్రపరిచామని, టాయ్‌లెట్‌లో కాదని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. జిల్లా క్రీడాధికారిని సస్పెండ్ చేసింది.