NewsTelangana

యూట్యూబ్‌తో ఎంబీబీఎస్‌ సీటు.. కవిత, వెంకట్‌రెడ్డి ఆపన్న హస్తం

ఆసక్తి ఉంటే చదువు పెద్ద కష్టమేమీ కాదని నిరూపించింది నిజామాబాద్‌ జిల్లా నాందేవ్‌ గూడకు చెందిన హారిక. యూట్యూబ్‌లో వీడియో క్లాసులు చూసి దేశంలో అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన నీట్‌ ర్యాంకు సాధించింది. వేలాది రూపాయల ఫీజులు కట్టి.. ప్రత్యక్ష తరగతులకు వెళ్లినా ర్యాంకు కష్టమైన నీట్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించింది. అయితే.. డబ్బులు లేకపోవడంతో ఎంబీబీఎస్‌ కాలేజీలో చేరలేని పరిస్థితి నెలకొంది. ఫీజు, హాస్టల్‌, పుస్తకాల ఫీజులు కలిపి ఏడాదికి రూ.2 లక్షల వరకు కట్టాల్సి ఉంది. హారిక దీన స్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఆమెకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తొలి ఏడాది కాలేజీ ఫీజును చెక్కు రూపంలో అందించారు. మంచి వైద్యురాలిగా సమాజానికి హారిక ఉత్తమ సేవలందాంచాలని సూచించారు.

తండ్రి లేడు.. తల్లి బీడీ కార్మికురాలు

శరత్‌ కుమార్‌, అనురాధలకు కుమార్తె హారిక, కుమారుడు ఈశ్వర్‌ ఉన్నారు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చదువులో మేటి అయిన హారిక పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు సాధించింది. డాక్టర్‌ కావాలని కలలు కన్న హారిక వద్ద కోచింగ్‌ కోసం డబ్బుల్లేవు. అయినా.. నిరాశ చెందకుండా పట్టుదలతో యూట్యూబ్‌లో వీడియో క్లాసులు వింటూ నీట్‌ పరీక్షకు సిద్ధమైంది. ఆమె కష్టానికి తగిన ఫలితం లభించి ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంకు సాధించింది. తనకున్న పరిమిత వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.

మరింత మంది సాయం..

హారిక మెడిసిన్‌ చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా హామీ ఇచ్చారు. ఆమె పీజీ పూర్తి చేసే వరకూ ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయం చేస్తుందన్నారు. సోమరవి, దూడ రవిల నేతృత్వంలో ఇజ్రాయిల్‌ తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధులు రూ.1.5 లక్షల చెక్కు ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐ లక్ష్మారెడ్డి రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు. మరికొంత మంది దాతలు, సంస్థలు కూడా రూ.1.55 లక్షల వరకు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా పంపించారు.