చెన్నైలో భారీ దోపిడీ..చివరకు ఊహించని ట్విస్ట్
తమిళనాడు రాజధాని చెన్నైలో కొన్నిరోజుల క్రితం ఓ ఆభరణాల రుణ సంస్థలో భారీ చోరీ జరిగింది. అయితే ఇది చీకటిపడిన తరువాతో, అర్ధరాత్రో జరగలేదు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. దుండగులు పట్టపగలు సంస్థ ఆఫీసులోకి చొరబడి.. అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించి రూ.20 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ దర్యాప్తులో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అపహరణకు గురైన నగల్లో కొన్ని స్థానిక ఇన్‌స్పెక్టర్ ఇంట్లో లభించడం ఇప్పడు చర్చనీయాంశమైంది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్ ఇంటి నుండి 3.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెన్నైలోని ఆరుంబాక్కంలో ఒక బ్రాంచ్ ఉంది. ఆగస్టు 13న మధ్యాహ్న సమయంలో ఈ బ్రాంచ్‌లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హఠాత్తుగా చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కస్టమర్లను బెదిరించి తాళ్లతో కట్టేశారు. ఆపై రూ.20 కోట్ల విలువైన నగలు, నగదును దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఫెడ్‌బ్యాంకులో పనిచేసే ఉద్యోగులే ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

వీరిలో ప్రధాన నిందితుడిగా మురుగన్ అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో భాగంగా మరుసటి రోజే సంతోష్ , బాలాజీ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.8.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ తరువాత రోజు ప్రధాన నిందితుడిగా అనుమానం ఉన్న మురుగన్‌తో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అనంతరం నిందితుం విచారించగా వీరిలో సంతోష్ అనే వ్యక్తి ఈ కేసులో ముఖ్య సమాచారాన్ని అందించాడు.

చోరీ చేసిన నగలలో కొన్నింటిని అచరపాక్కమ్ ఇన్‌స్పెక్టర్ అమల్‌రాజ్ ఇంట్లో దాచిపెట్టానని చెప్పాడు. అయితే నిందితుడు సంతోష్ అమల్‌రాజ్ భార్యకు బంధువు కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు గురువారం ఇన్‌స్పెక్టర్ ఇంట్లో సోదాలు జరపగా 3.7 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. దీంతో అమల్‌రాజ్, ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడితో తనకు, తన భార్యకు ఎటువంటి సంబంధం లేదని ఇన్‌స్పెక్టర్ అంటున్నారు. ఈ చోరీ జరిగిన రాత్రి సంతోష్ ఎప్పటిలాగే తమ ఇంటికి వచ్చాడని.. అతని దగ్గర బంగారం ఉన్నట్లు కూడా తమకు తెలియదని ఇన్‌స్పెక్టర్ అమల్‌రాజ్ స్పష్టం చేశారు. దీని కారణంగా దర్యాప్తును మరింత లోతుగా జరిపించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.