తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్స్ అనే షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ షాపులో కోట్ల విలువ గల ఫొటో ఫ్రేమ్స్ కాలిపోయాయని చెప్తున్నారు. ఈ సమీపంలోని పార్క్ చేసిన చాలా బైకులు కూడా కాలిపోయాయి. ఈ షాప్ దగ్గరలో ఫ్రేమ్స్ తయారు చేస్తారు. షార్ట్ సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. యాత్రికుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ఫైర్ సిబ్బంది త్వరితగతిన మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి దగ్గరలోనే గోవిందరాజస్వామి ఆలయం రథం ఉంది. గోవిందరాజస్వామి ఆలయ మాడవీధులను ఇప్పటికే మూసి వేశారు. గాంధీ రోడ్ నుండి రైల్వే స్టేషన్‌కు చేరుకునే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఫొటో ఫ్రేమ్స్ ప్లాస్టిక్‌తో తయారయ్యాయని వీటికి అంటిన మంటలను అదుపు చేయడం అంత సులభం కాదని అధికారులు చెప్తున్నారు.

ఈ గోవిందరాజస్వామి రథాన్ని అక్కడినుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంటలు భారీగా వ్యాప్తి చెందాయి. ఈ స్థలం ఫొటోల తయారీ పరిశ్రమగా ఉంది. ఇరుకు వీధులు కావడంతో అక్కడ చుట్టు ప్రక్కల కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచారు. టీటీడీ సిబ్బంది, తిరుపతి పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి ఈ మంటలను అదుపు చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.