రామ్‌గోపాల్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం -అదుపులోకి రాని మంటలు
సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట్‌లోని డెక్కన్ స్టోర్ భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం నుండి రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నా ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. అక్కడికి 100 మీటర్ల దూరంలోనే కిమ్స్ ఆసుపత్రి ఉండడం కూడా భయానికి దారి తీస్తోంది. ఇక్కడి దట్టమైన పొగ అక్కడికి కూడా వ్యాపిస్తోంది. ఘటనా స్థలంలో 10 ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫైర్ సిబ్బంది భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. డెక్కన్ స్టోర్ మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు కూడా వ్యాపించాయి. దీనితో అక్కడి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు చుట్టుపక్కల ఇళ్లను, దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. తీవ్రమైన పొగ, మంటలతో ఫైర్ సిబ్బందికి రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారుతోంది. మంటలు అదుపులోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. భవనం పూర్తిగా కూలిపోయే పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. మంటలను కెమికల్స్ సహాయంతో అదుపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.