మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టులు–భద్రతా బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో అగ్ర మావోయిస్టు నేత మద్వి హిడ్మా మృతి చెందినట్లు భద్రతాధికారులు నిర్ధారించారు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
ఎవరు ఈ మద్వి హిడ్మా?
మద్వి హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పర్వతి గ్రామానికి చెందినవాడు. స్థానిక మూరియా తెగకు చెందిన హిడ్మా, గత దశాబ్ద కాలంగా దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కీలక దళం DVC (డివిజనల్ కమిటీ)లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అనేక కీలక దాడులకు హిడ్మానే సూత్రధారిగా ఉన్నట్లు భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏపీ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై ముందుగా లభించిన సమాచారంతో ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

