భారీ ఆస్ట్రరాయిడ్ ప్రమాదం
సకల జీవరాశులతో అలరారుతున్న భూమి ఒక పెద్ద ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుంది. “2025 FA22” అనే భారీ ఆస్ట్రరాయిడ్ గురువారం ఉదయం భూమి నుంచి దాదాపు 842,000 కిలోమీటర్లు దూరంలో వెళ్లింది. ఒక పెద్ద నగరాన్ని నాశనం చేయగల ఈ గ్రహశకలం గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకొచ్చింది. ఈ గ్రహశకలం వాషింగ్టన్ మాన్యుమెంట్ అంత భారీగా ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఊరట కలిగించే విషయం ఏంటంటే చాలా దగ్గరగా సమీపించినప్పటికీ ఇది భూమికి ఎటువంటి ముప్పును కలిగించలేదు. ఈ గ్రహశకలం 130 నుంచి 290 మీటర్లు వెడల్పు ఉంటుందని అంచనా. దీనిని మార్చి 2025లో గుర్తించారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు దీనిని పర్యవేక్షిస్తూ వస్తున్నారు. దీని పరిమాణం, కక్ష్యను బట్టి దీనిని పొటెన్షియల్లీ హాజర్డస్ ఆస్ట్రాయిడ్ గా వర్గీకరించారు. దీనర్థం ఇది భవిష్యత్తులో భూమికి దగ్గరగా రాగల ప్రమాదకరమైన గ్రహశకలం. నాసా చెప్పిన ప్రకారం “ఈ పరిమాణంలో ఉన్న ఒక గ్రహశకలం భూమిని ఢీకొంటే 2 కిలోమీటర్ల వెడల్పు గల బిలం ఏర్పడవచ్చు. కానీ ఇలా ప్రతి 20,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ముప్పును కలిగించకుండా భూమికి హలో చెప్పి వెళ్లిపోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.