Andhra PradeshHome Page Slider

దటీజ్ మర్రి రాజశేఖర్.. వైసీపీలో ఒకే ఒక్కడు..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ముఖ్యనేత మర్రి రాజశేఖర్ విజయం సాధించారు. మొదట్నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ఆయనకు పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీగా విజయం ద్వారా మర్రి రాజశేఖర్‌కు సముచిత గుర్తింపు లభించినట్టయ్యింది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న మర్రి రాజశేఖర్, వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు మర్రి రంగం సిద్ధం చేసుకున్నారు. ఐతే పార్టీ అధినేత ఆదేశాలతో… విడదల రజనీ కోసం టికెట్ త్యాగం చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌కు మద్దతుగా చిలకలూరిపేట ప్రచారంలో జగన్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం గెలిపించుకొని రావాలని.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎంపికలో ఆయనకు అవకాశం లభించలేదు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అనుకోకుండా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే విడదల రజనీకి, అంబటి రాంబాబుకు కేబినెట్‌లో బెర్త్ ఖరారు కావడంతో జిల్లా రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని మొదట్నుంచి మర్రి విశ్వాసంతో ఉన్నారు.

మొదటి విడతలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకున్నప్పటికీ పార్టీ పరంగా మర్రికి జగన్ గుర్తింపు ఇచ్చారు. గుంటూరు, కృష్ణా జిల్లాల కోర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఐతే తాజాగా మర్రి రాజశేఖర్‌కి జగన్ ఛాన్స్ ఇచ్చారు. మొత్తంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో పూర్వవైభవం సాధించేందుకు ఎమ్మెల్సీ విజయం తొలిమెట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మర్రి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నాడు జగన్ హామీ ఇచ్చారని.. నేడు అమలు చేశారన్నారు. జగన్ చెప్పాడంటే చేస్తారంతేనన్నారు. పార్టీలో ఎప్పుడూ తనకు జగన్ ప్రయారిటీ ఇచ్చారన్నారు. అవకాశం వచ్చినప్పుడు అన్నీ అమలు చేస్తారని.. కంగారు అక్కర్లేదన్నారు. ఇక త్వరలో కేబినెట్ విస్తరణ చేసే అవకాశముందటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బలమైన కమ్మ సామాజికవర్గం నుంచి మర్రికి కేబినెట్‌లో బెర్త్ ఖాయమన్న ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గాన్ని ఓట్లను పొందాలంటే ఆ వర్గం నుంచి ఒకరికైనా మంత్రి పదవి ఇవ్వాలన్న చర్చ పార్టీలో కూడా సాగుతోంది.

చిలకలూరిపేట నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ మొదట్నుంచి యాక్టివ్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. వైసీపీ కమ్మ సామాజికవర్గం నేతల్లో ఆయనది ప్రత్యేక శైలి. నిరాడంబరత, అణకువగా ఉంటూ ఆయన తన పని తాను చేసుకుపోతుంటారు. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు. 2004లో తొలిసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి సత్తా చాటారు. జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ… వైఎస్సార్‌కు నమ్మినబంటుగా వ్యవహరించారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం ప్రకటించి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కేవలం 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ పార్టీని గ్రామగ్రామంలో నిలబెట్టారు. 2019లో తనకు అవకాశం వస్తుందనుకున్న తరుణంలో టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన విడదల రజనీకి జగన్ టికెట్ కేటాయించారు. ఐనప్పటికీ పార్టీ ఆదేశాలను మర్రి శిరసా వహించారు. ఐతే రాజశేఖర్‌కు సముచిత స్థానం ఇచ్చి గౌరవించే బాధ్యత తనదని, కేబినెట్‌లో తీసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్… కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అవకాశం ఇస్తారని మర్రి అభిమానులు భావిస్తున్నారు.