కేసీఆర్ తోటలో చంద్రశేఖర్
ఏపీలో బీఆర్ఎస్ హడావుడి కన్పిస్తోంది. బీఆర్ఎస్ ఏర్పాటు, నేతల చేరికలకు సంబంధించి క్లారిటీ వస్తోంది. ఇప్పటికే మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా వ్యహరించే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే చంద్రశేఖర్‌కు ఏపీ పగ్గాలు అప్పగిస్తే వచ్చే లాభనష్టాలను కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఏపీలో పర్యటించి, ప్రజల మన్ననలు పొందాలని భావిస్తున్న కేసీఆర్.. బలమైన సామాజికవర్గాలను తమవైపునకు తిప్పుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా కొందరు అధికారులు భారత రాష్ట్ర సమితిలో చేరితే.. పార్టీకి ఊపు వస్తోందని అంచనా వేస్తున్నారు. గతంలో వైసీపీ ఆ తర్వాత జనసేన నుంచి బరిలో దిగి ఎన్నికల్లో ఓడిన తోట చంద్రశేఖర్… కేసీఆర్‌తో కలిసి నడవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పార్టీ నిర్మాణానికి సంబంధించి కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఐతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేతలందరూ కూడా జనసేన పార్టీ వారేనన్న చర్చ జరుగుతోంది. కాపు సామాజికవర్గానికి దన్నుగా ఉంటానని చెప్పుకునే తోట చంద్రశేఖర్, కీలకమైన ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు హ్యాండిచ్చి.. కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయానికి వచ్చారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనకు దూరంగా ఉన్న చంద్రశేఖర్, ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. సీపీఐ నుంచి 99 టీవీని కొనుగోలు చేసిన చంద్రశేఖర్… రాజకీయంగా తనకు అన్నీ శుభశకునములేనని భావిస్తున్నారు. ఏపీలో తాను ఏపార్టీలో చేరినా పెద్దగా ఫరక్ పడదని… అదే బీఆర్ఎస్ పార్టీలో చేరితే.. కనీసం తెలంగాణలో తన ఇమేజ్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రశేఖర్ సుమారుగా 16 శాతం ఓట్లతో, 27,869 ఓట్లను పొంది మూడో స్థానంలో నిలిచారు. చంద్రశేఖర్ తోపాటు మాజీ మంత్రి రావెల కిషోర్ సైతం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. 2017 మంత్రి వర్గ విస్తరణతో పదవి కోల్పోయిన రావెల 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రావెలకు 12.54 శాతం ఓట్లతో 26,371 ఓట్లను పొంది మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల జనసేనకు గుడ్ బై చెప్పిన రావెల.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో చేరాలని భావిస్తున్నారు.

ఇక గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఎన్నికల్లో ఓడిన పార్థసారధి… గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. 2019లో ఆయనకు 6.6 శాతం ఓట్లతో మొత్తం 82,588 ఓట్లు లభించాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ తగిన పార్టీ అని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముగ్గురు అఖిల భారత ఉద్యోగులు భారత రాష్ట్ర సమితిలో చేరడం వెనుక కేసీఆర్ స్ట్రాటజీ ఏంటన్నది త్వరలోనే తేలనుంది. వీరితోపాటు వైసీపీ, టీడీపీ నేతల్లో ఇప్పుడు బీఆర్ఎస్ టెన్షన్ ఎక్కువవుతోంటే… జనసేనాని చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్ గా కేసీఆర్ రాజకీయాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. ముగ్గురు నేతలు సైతం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసినవారే కావడంతో.. వచ్చే రోజుల్లో ఈ రాజకీయం ఎలాంటి ట్విస్టులు తీసుకుటుందో చూడాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పయనించాలని యోచిస్తున్న పవన్ కల్యాణ్‌కు ముందు ముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ప్రతిఘటన ఖాయంలా కన్పిస్తోంది. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ పోషించే పాత్రను బట్టి.. జనసేన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది.
