మన్ కీ బాత్ వినలేదని.. నర్సింగ్ విద్యార్థులపై చర్యలు
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వినలేదని కాబోయే నర్సులపై కాలేజ్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు వారం రోజుల పాటు బయటకు వెళ్ళేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. 36 మంది నర్సింగ్ స్టూడెంట్లకు నోటీసులు పంపించింది. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఈ చర్యలు తీసుకుంది. అయితే.. మరో వైపు మెడికల్ కాలేజ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ మహువా మొయిత్రా ఈ ఘటనపై స్పందిస్తూ.. మోదీ మన్ కీ బాత్‌ను తాను కూడా ఎప్పుడూ వినలేదని, మరి తనపైనా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. తాను కూడా తన ఇంట్లో నుంచి వారం రోజుల పాటు బయటకు వెళ్ళకుండా నిషేధిస్తారా? అన్నారు. ఆలోచిస్తుంటే భయమేస్తోందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

