ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మణిపూర్ బాధిత మహిళలు
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై బాధిత మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఇద్దరు మహిళలపై బహిరంగ ప్రదేశంలో జరిగిన సామూహిక మానభంగం, నగ్న ఊరేగింపులపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బాధ్యత వహించాలంటూ బాధిత మహిళలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పేర్లను బహిరంగ పరచకుండా వారిని X మరియ Y గా పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని, తమకు భద్రత కలిపించాలని వీరు కోరారు. సీఆర్‌పీసీ చట్టం 164 కింద తమ వాంగ్మూలాన్ని సమీప ఏరియా మేజిస్ట్రేట్ నమోదు చేయాలని కోరుకున్నారు. గతవారం సుప్రీంకోర్టు బహిర్గతమైన వీడియోపై తీవ్రంగా స్పందించింది. రాజ్యాంగ విలువలు పూర్తిగా నశించిపోయాయని, రాజ్యాంగ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కంది. ఈ ప్రాంత మహిళల కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడా ఆదేశించారు. ప్రభుత్వాలు చొరవ తీసుకోకుంటే తామే కలుగజేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వీరికోసం ఐజీ ర్యాంకు అధికారిచే ఒక సిట్‌ను ఏర్పాటు చేసి, విచారణ జరిపించవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ కేసును మణిపూర్ రాష్ట్రం బయట పోలీసులచే విచారణ చేపట్టాలని, వారి రిపోర్టును నేరుగా సుప్రీంకోర్టుకే అప్పగించాలని సూచించారు. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు కేవలం 35 కిలోమీటల దూరంలో ఉన్న కాంగ్పోక్సి జిల్లాలో మే 4న ఈఘటన జరిగిందని ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ పోరం తెలిపింది. అయితే ఈ ఘటన పై కాంగ్పోక్సీలో ఫిర్యాదు నమోదయ్యిందయ్యిందని , కానీ వేరే జిల్లాలో జరిగిందంటూ అక్కడి పోలీసులు చెప్తున్నారు. షెడ్యూల్ తెగల హోదా కోసం మెయితీ, కుకి తెగల మధ్య చెలరేగిన హింస కారణంగా మరుసటి దినమే ఈ దారుణం జరిగింది. ఈ జాతుల మధ్య హింసపై నమోదయిన పలు పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు జూలై 28న విచారించాల్సి ఉండగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది.

