ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌కు షాక్ ట్రీట్మెంట్…
గురివిందగింజ తన నలుపెరగదన్నట్టుగా పాకిస్తాన్, తన సంగతి చూసుకోకుండా పక్కనోళ్ల సంగతి చూస్తోందంటూ ఐక్యరాజ్యసమితిలో ఇండియా దుమ్మెత్తిపోసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్… జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై ఇండియా విరుచుకుపడింది. పాకిస్తాన్, సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తూ , కొరివితో తలగోక్కుంటుందని విమర్శించింది. ఐక్యరాజ్యసమితిలో ఇండియా మొదటి సెక్రటరీ, భావిక మంగళానందన్, ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ దోహదపడుతుందని ఆరోపించారు. ఇండియాకు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని, ఆ దేశ పాలకులే ప్రోత్సహిస్తున్నారని తేల్చి చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన 2019 ఆర్టికల్ 370 రద్దును భారతదేశం వెనక్కి తీసుకోవాలని షరీఫ్ డిమాండ్‌కు ఆమె ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. చర్చలు కోసం షరీఫ్ డిమాండ్ అర్థరహితమని ఆమె క్లారిటీ ఇచ్చారు.

“ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఉదయం ఒక అవహేళన చేటుచేసుకుంది. తీవ్రవాదం, మాదక ద్రవ్యాల వ్యాపారం, అంతర్జాతీయ నేరాలకు ప్రపంచ ఖ్యాతి గడించిన మిలటరీ ఆధ్వర్యంలో నడిచే దేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంపై దాడి చేసే సాహసం చేస్తోంది” అని మంగళానందన్ మండిపడ్డారు. “పాకిస్థాన్ ఏంటో ప్రపంచం చూస్తూనే ఉందని ఆమె చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రబిందువుగా ఉందని ఇండియా ఆరోపించింది. మాదక ద్రవ్యాల అక్రమరవాణా, వ్యాపారం, అంతర్జాతీయ నేరాల విషయంలో షరీఫ్ ప్రసంగం పెద్ద జోక్ అని ఆమె వివరించారు. 2001 భారత పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులతో సహా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులు నిర్వహించిన దాడులను ఆమె ప్రస్తావించారు. మిలిటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాకిస్తాన్, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంపై దాడి చేసే ధైర్యం చేసిందని ఆమె విమర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రవాద ఘటనలపై పాకిస్థాన్ ప్రమేయం ఉందని మంగళానందన్ అన్నారు. “బహుశా ఈ పవిత్రమైన హాలులో పాక్ ప్రధాని అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. ఆయన మాటలు ఎవరికీ ఆమోదయోగ్యం కాదని స్పష్టంగా చెప్పాలి. పాకిస్తాన్ మరిన్ని అబద్ధాలతో సత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుందో మాకు తెలుసు. మా స్టాండ్ ఏదీ మార్చదు. పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు” అని ఆమె అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించనంత వరకు పాకిస్థాన్‌తో “వ్యూహాత్మక నియంత్రణ పాలన” గురించి చర్చ జరగదని భారత్ పునరుద్ఘాటించింది. ‘ఉగ్రవాదంతో ఎలాంటి ఒప్పందం కుదరదు’ అని మంగళానందన్ పేర్కొన్నారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమివ్వడం, ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ ఉగ్రవాద సంఘటనలతో సంబంధాలతో సహా పాకిస్తాన్ గతం గురించి కూడా ఆమె మాట్లాడారు.

షరీఫ్ తన ప్రసంగంలో కశ్మీర్ సమస్యను ప్రాంతీయ శాంతితో ముడిపెట్టారు. భారత్ సైనిక విస్తరణ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉందని కూడా ఆయన ఆరోపించారు. అయితే, ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించాలని కోరుతూ ఉగ్రవాదం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ జోక్యం చేసుకున్న చరిత్రను మంగళానందన్ ఎత్తిచూపారు. భారత్ ప్రతిస్పందన ఉగ్రవాదాన్ని దాటి పాకిస్థాన్ అంతర్గత సమస్యలకు కూడా విస్తరించింది. 1971లో బంగ్లాదేశ్‌లో జరిగిన మారణహోమం, మైనారిటీలపై జరిగిన హింసను ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మంగళానందన్ ఆరోపించారు. పాకిస్తాన్ తన సొంత రికార్డుతో అసహనం గురించి ప్రపంచానికి ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆమె అన్నారు. ఐతే భారతదేశ వాదనలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవి అని పాకిస్తాన్ విమర్శించింది. UN భద్రతా మండలి తీర్మానాల ప్రకారం జమ్మూ, కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు డిమాండ్ చేసింది.

