మన శంకర వర ప్రసాద్ గారు.. మూవీ రివ్యూ
మూడేళ్ళ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా ఆయన ‘భోళాశంకర్’ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ చేశారు. అనేక కారణాలతో ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు’ తెరమీదకు వచ్చింది. ఇందులో వెంకటేష్ కీలక పాత్రలో సర్‌ప్రైజ్ చేయడం విశేషం. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఈ నెల 12న సోమవారం సినిమా విడుదలయింది. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి వెంకటేష్‌కి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవికి కూడా అలాంటి హిట్ ఇచ్చాడా? సినిమా ఎలా ఉందనేది చూద్దాం…
కథ: కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా)కు నిన్ను చంపేస్తున్నాం అంటూ ఓ హంతకుల గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్ రావడం.. ఆయన దగ్గర పనిచేస్తున్న నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర్‌వరప్రసాద్(చిరంజీవి) ఆ గ్యాంగ్‌ని తుదముట్టించడంతో కథ మొదలవుతుంది. శంకర్‌వరప్రసాద్‌ని శర్మ తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ సరదాగా ఉండే శంకరప్రసాద్ మనసులో ఏదో బాధ ఉన్నదని గ్రహించిన శర్మ.. ఓ రోజు శంకరప్రసాద్‌ని కారణం అడగుతాడు. భార్యతో విడిపోవడం.. కన్నబిడ్డలకు దూరం కావడం.. ఇవే శంకర వరప్రసాద్ బాధకు కారణాలని శర్మకు అర్థమవుతుంది. అందుకే ఓ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటున్న పిల్లల్ని కలుసుకునే ఏర్పాటు చేస్తాడు మినిస్టర్ శర్మ. ఆ స్కూల్‌లో పీఈటీగా జాయిన్ అయిన శంకర వరప్రసాద్.. తన పిల్లలకు ఎలా చేరువయ్యాడు? అసలు శంకరప్రసాద్ భార్యతో విడిపోవడానికి కారణం ఏంటి? చివరకు ఆ కుటుంబం ఎలా కలిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ: దర్శకుడు అనిల్ రావిపూడి చేసే మ్యాజిక్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులోనూ ఆయన మరోసారి ఆ మ్యాజిక్ వర్కౌట్ చేశారు. రొటీన్ కామెడీ, రొటీన్ స్టోరీనే అయినా, సందర్భానుసారంగా దాన్ని వర్కౌట్ చేశాడు. చిరంజీవి దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లారు. దీంతో అవి బాగా పండాయి…అలరించాయి. అన్ని ఎలిమెంట్లని పర్‌ఫెక్ట్ గా మేళవించడంలో అనిల్ సక్సెస్ అయ్యాడు. అది రిజల్ట్ లో కనిపిస్తుంది. మొత్తంగా దర్శకుడు తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి సక్సెస్ అయ్యాడు. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రాల్లో కథ కంటే ఎంటర్‌టైన్‌మెంటే ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ లేకుండా, అత్యంత సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. వినోదం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. కానీ కథగా చూసినప్పుడు ఏమీ ఉండదు. స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేస్తాడు. చూస్తున్నంత సేపు నవ్వులు పూయిస్తాడు. ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తూ వరుసగా విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ గారు విషయంలోనూ అదే చేశాడు. సీన్ బై సీన్ కామెడీ ఎపిసోడ్లని పేర్చుకుంటూ వెళ్లాడు. ఎక్కడా డౌన్ కాకుండా చూసుకున్నారు. డల్ అవుతున్న సమయంలో మంచి కామెడీ బ్లాక్‌ని వేసి నవ్వులు పూయించాడు. కథ కంటే స్క్రీన్‌ప్లే పై బాగా ఫోకస్ పెట్టాడు. కామెడీ పార్ట్ ని బాగా రాసుకున్నాడు. దానికి చిరంజీవి యాడ్ అయ్యారు. చిరంజీవిలోని పూర్తి కామెడీ టైమింగ్‌ని, ఫన్ యాంగిల్‌ని, స్టయిల్‌ని, యాక్షన్‌ని ఇందులో గట్టిగా వాడుకున్నాడు దర్శకుడు అనిల్. దీంతో ఆయా సీన్లు తెరపై బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాగా చూసినప్పుడు ఫస్ట్ చిరంజీవిని సింపుల్‌గా పరిచయం చేసి, మంత్రిని రక్షించే టైమ్‌లో యాక్షన్ ఎపిసోడ్ పెట్టి, మెగాస్టార్‌కి అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. అక్కడ విజిల్స్ పడతాయి. ఒకప్పుడు తానేంటో అందరికి తెలుసు. ఇప్పుడు పిల్లబచ్చాలకు తానేంటో చూపిస్తాను అంటూ డైలాగ్ కొడుతూ చిరంజీవి చేసే రచ్చ అదిరిపోయింది. టీవీ సీరియల్ చూస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం, దాన్ని తన లైఫ్‌కి ఆపాదించుకోవడం, ఆవేదన చెందడం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్ ని కలిసే సన్నివేశాలు.. వీరి మధ్య మూగ సందేశం కూడా ఆకట్టుకుంది పెళ్లి చేసుకోవడం, అంతలోనే గొడవలు స్టార్ట్ కావడం, విడిపోవడం చకాచకా జరిగిపోతుంటాయి. ఎక్కడా గ్యాప్ లేకుండా సీన్లని హిలేరియస్‌గా నడిపించాడు దర్శకుడు. చిరంజీవి ఛాన్స్ దొరికినప్పుడు తన డైలాగ్‌లతో రెచ్చిపోయాడు. డైలాగ్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. దీనికి చిరంజీవి యాక్టింగ్ తోడు కావడంతో మరింతగా కామెడీ పండింది. బుల్లిరాజు ఎపిసోడ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. స్కూల్‌లో పిల్లలకు దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నాలు బెడిసి కొట్టడం, ఆ తర్వాత వర్కౌట్ కావడం నవ్విస్తుంది.ఫస్టాఫ్ వరకు ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్లతో అలరించారు. ఇంటర్వెల్ యాక్షన్ సీన్ అదిరిపోయింది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్ కూడా విజిల్స్ వేసేలా ఉంటుంది. ఫస్టాఫ్ వరకు ఎక్కడా తగ్గకుండా నడుస్తుంది. కానీ సెకండాఫ్ తర్వాత క్రమంగా డౌన్ అయ్యింది. ఆ తర్వాత సినిమా అంతా శశిరేఖ ఇంటికి వెళ్తుంది. అది గతంలో వచ్చిన రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా నడుస్తుంది. భార్యని ఇంప్రెస్ చేయడానికి చిరంజీవి పడే పాట్లు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడ ఫన్ వర్కౌట్ అయ్యింది. కానీ ఆ ఫస్టాఫ్ స్థాయిలో లేదు. ఇన్వెస్టిగేషన్ పేరుతో చేసే డ్రామా కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమా డల్ అవుతున్న సమయంలో వెంకటేష్ దిగుతాడు. ఆ తర్వాత సినిమా లేస్తుందని భావించగా, అది మరింతగా డల్ చేసింది. ఆ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో లేదు. కాకపోతే చిరంజీవి, వెంకీ అభిమానులు మాత్రం ఆయా సీన్లని ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్ మొత్తం ఊహించినట్టుగానే వెళ్తుంది. అక్కడ కూడా సేమ్ కామెడీ సీన్లు పెట్టుకోవడంతో ఆ కిక్ మిస్ అయ్యింది. చివర్లో యాక్షన్ సీన్ తో రెగ్యూలర్‌గానే ముగించాడు. విలన్ పాత్ర చాలా వీక్‌గా ఉంది. దీంతో చివర్లో యాక్షన్ అంతగా కిక్ ఇవ్వలేదు. ఫస్టాఫ్ లాగా సెకండాఫ్‌ని కూడా వర్కౌట్ చేస్తే, క్లైమాక్స్ ని బాగా చేయగలిగితే సినిమా ఇంకా వేరే లెవల్‌లో ఉండేది. వెంకీ ఎపిసోడ్‌ని కూడా బాగా డిజైన్ చేయాల్సింది. అయితే ఓ వైపు కామెడీ, మరోవైపు ఫ్యామిలీ ఎలిమెంట్లు, భార్యతో గొడవలు, పిల్లల సెంటిమెంట్, యాక్షన్, వెంకీ సర్‌ప్రైజ్‌లతో మంచి ఫ్యాకేజీ ఫిల్మ్ గా ఇది సాగుతుంది. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవిలో పాతిక, ఇరవై ఏళ్ల క్రితం కనిపించిన మేనరిజం, కామెడీ టైమింగ్‌తో పాటు కళ్ళతోనే ఆయన నటించే తీరు ఈ సినిమాలో కీలకం. ఒకరకంగా చెప్పాలంటే టైటిల్ మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే పెట్టడమే కాదు, సినిమా మొత్తాన్ని ఆయన భుజాల మీద నడిపించాడు. విక్టరీ వెంకటేష్ కనిపించింది కొద్దిసేపైనా, ఆ కొద్దిసేపు అందరినీ తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఇక నయనతార ఎప్పటిలాగే శశిరేఖగా హుందాగా నటించింది. సచిన్ ఖేడేకర్ ఆ పాత్రకు కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్‌లో నటించిన హర్ష, అభినవ్ గోమఠం, క్యాథరిన్ సహా చిరంజీవి తల్లి పాత్రలో నటించిన జరీనా వహాబ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నీకల్‌గా ఎలా ఉందంటే.. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా, ట్రీట్‌లాగా ఉంది. కనువిందుగా ఉంది. దీనికి ఆర్ట్ వర్క్ కూడా తోడయ్యింది. ఏఎస్ ప్రకాష్ తన టాలెంట్ కనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి మరో అసెట్‌గా నిలిచింది. పాటలు మంచి హుషారుగా, డాన్సులు వేసేలా ఉన్నాయి. మాస్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. చిన్న చిన్న బిట్ సాంగ్‌లు తేడా కొట్టినా, అదరగొట్టారు. వెంకటేష్‌తో పాట ఊపు తెచ్చేలా ఉంది. కానీ ఆ స్థాయిలో పాట లిరిక్ లేదు. తేలిపోయింది. డాన్సులు ఆకట్టుకున్నాయి. బిజీఎం విషయంలో మ్యాజిక్ చేశారు. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా రిచ్‌గా, రాజీపడకుండా నిర్మించారు. అది ప్రతి ఫ్రేములోనూ ఆ రిచ్‌నెస్ కనిపిస్తుంది. మొత్తం మీద ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి వచ్చిన పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. (రేటింగ్ 3.5/5)
-ఎం.డి అబ్దుల్

