NationalNews Alert

బెంజి కారులో రేషన్ సరుకులు తీసుకెళ్లిన పేదవాడు

రేషన్ పంపిణీలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయో మరోసారి రుజువయ్యింది. పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవడానికి ఓవ్యక్తి బెంజి కారులో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఓ ప్రభుత్వ రేషన్ దుకాణం వద్ద ఓ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారు వచ్చి ఆగింది. ఓ వ్యక్తి దిగి, తన BPL కార్డు చూపించి రేషన్ సరుకులు తీసుకుని, కారు డిక్కీలో పెట్టించుకుని అక్కడనుండి వెళ్లిపోయాడు. ఆవీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు అది వైరల్‌గా మారింది.

దీనితో చాలామంది రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ రేషన్ దుకాణాన్ని అమిత్ కుమార్ అనేవ్యక్తి నిర్వహిస్తున్నాడు. స్థానిక విలేకరులు అమిత్‌ను ప్రశ్నించగా ఆవ్యక్తికి బీపీఎల్ కార్డు ఉందని, తనకు అతను కారులో వచ్చిన విషయం తెలియదని సమాధానమిచ్చాడు.

వీడియో వైరల్ అవడంతో ఆవ్యక్తి కూడా స్పందించి, ఆకారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి ముందు పార్కు చేసారని, తాను అప్పుడప్పుడు ఆ కారును ఉపయోగిస్తానని అంటున్నాడు. తాను  పేదవ్యక్తినే అని. తన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారన్నాడు.