ఒంటరిగా దశాబ్దాలుగా దండకారణ్యంలో బతికి,చివరికి…
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో దశాబ్దాలుగా ఒంటరిగా బాహ్యప్రపంచంతో సంబంధాలు లేని ఓ ఆదివాసీ జాతికి చెందిన చివరి వ్యక్తి ఇటీవల మరణించాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ అధికారికంగా ప్రకటించింది. అతని పేరు ఎవరికీ తెలియదు. గత 26 ఏళ్ల నుంచి ఆ వ్యక్తి బ్రెజిల్ అడవుల్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆయనకు బయటి ప్రపంచంతో సంబంధం లేదు.

దీంతో ఈ జాతి పూర్తిగా కనుమరుగైంది. బ్రెజిల్‌లోని రోండోనియా రాష్ట్రంలో టనారు అనే ఆదివాసీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. పేరు తెలియని ఈ వ్యక్తి గత 26 ఏళ్లు నుంచి పూర్తిగా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నాడు. అతడిని ‘మ్యాన్ ఆఫ్ హోల్’ అని పిలుస్తారు. అతడు జంతువులను వేటాడేందుకు లోతైన గొతులు తవ్వుతాడు. దీంతో అధికారులు ఆ పేరుపెట్టారు. మరణించేనాటికి అతడికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు.

1970ల్లో భూస్వాములు చుట్టుపక్కల పశువుల పెంపకం కోసం, తమ పొలాలు విస్తరించేందుకు అతడి జాతికి చెందిన చాలా మందిని అంతమొందించారు. 1995లో అక్రమ మైనింగ్ తవ్వకాలకు పాల్పడేవారు మరో ఆరుగురిని హత్య చేశారు. దీంతో ఒకే ఒక్క వ్యక్తి మిగిలాడు. నాటి నుంచి ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ విషయాన్ని 1996లో బ్రెజిల్ ఆదివాసీ వ్యవహారాల ఏజెన్సీ తెలుసుకొంది. నాటి నుంచి అతడు సంచరించే ప్రాంతాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోకి ఇతరులు వెళ్లడంపై బ్రెజిల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బంది ఒకరు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆగస్టు 23న తన గుడిసెకు సమీపంలోని ఓ చెట్టుకు కట్టుకున్న ఉయ్యాలలో ఆదివాసీ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించాడు.

ఈ ఘటనపై బ్రెజిల్‌లోని ఆదివాసీలపై పరిశోధనలు చేసే మార్సెలో డోస్ శాంటోస్ మాట్లాడుతూ.. ”మరణం సమీపించిందని ముందుగానే అంచనాకు వచ్చి ఉంటాడని వారి తెగ ప్రకారం అతడి శరీరంపై ఈకలు పేర్చుకొన్నాడు” అని పేర్కొన్నారు. అతడి మృతదేహం ఉన్న తీరును బట్టి.. చనిపోయి అగస్టు 23వ తేదికి కనీసం 40 నుంచి 50 రోజుల అవుతుందని భావిస్తున్నారు. అయితే అ వ్యక్తికి పోస్టుమార్టం తర్వాత అంతిమ క్రియలు బ్రెజిల్ అధికారులు నిర్వహించనున్నారు.

