Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTelanganaviral

రాజకీయాలకు మల్లారెడ్డి గుడ్‌బై

తెలంగాణ రాజకీయ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ మంత్రి, అనుభవజ్ఞుడైన నాయకుడు మల్లారెడ్డి తన భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత కొన్ని రోజులుగా వస్తున్న బీజేపీ లేదా టీడీపీ వైపు వెళ్లే అవకాశాలపై ఉన్న ఊహాగానాలకు తెరదించారు. “నేను ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఇతర పార్టీల వైపు వెళ్లే ఆలోచన అసలు లేదు” అని స్పష్టం చేశారు. మల్లారెడ్డి తన వయసు 73 సంవత్సరాలు కావడంతో ఇకపై కొత్త రాజకీయ సవాళ్లను స్వీకరించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసి తన రాజకీయ జీవితంలో ఉన్నత స్థానాలను అనుభవించానని, మరో మూడేళ్లలో రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలనే సంకల్పం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇకపై ప్రజాసేవకు, ముఖ్యంగా విద్యారంగ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని తెలిపారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు, విశ్వవిద్యాలయాలను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. రాజకీయాల్లో పదవీ విరమణ ప్రకటించినా, సమాజ సేవలో మాత్రం ముందంజలో ఉంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.