Home Page SliderNational

వయనాడ్‌లో పర్యటించిన మలయాళ స్టార్ మోహన్‌లాల్‌

కేరళ  రాష్ట్రం వయనాడ్‌లో మలయాళ నటుడు మోహన్‌లాల్‌  పర్యటిస్తున్నారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి స‌మీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358 కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్‌లో మలయాళ నటుడు మోహన్‌లాల్‌ పర్యటిస్తున్నారు.

మోహన్‌లాల్‌ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడి చేరుకున్న మోహన్‌లాల్‌కు సైన్యం స్వాగతం పలికింది. అనంతరం అక్కడ అధికారులతో మోహన్‌లాల్‌ భేటీ అయ్యారు. అనంతరం ముండక్కై, చుర్‌ము లాల్‌ సహా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్‌లాల్‌ పరామర్శించారు. ఇక ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు మోహన్‌ లాల్‌.. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు, ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన మెచ్చుకున్నారు.