‘బీఆర్‌ఎస్ వాళ్లకు మేడిగడ్డ పిక్నిక్ స్పాట్‌లా మారింది’..ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్‌ఎస్ పార్టీకి మేడిగడ్డ పిక్నిక్ స్పాట్‌గా మారిందంటూ విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీడియా మీటింగులో ఆయన మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాను రూ.38 వేల కోట్ల నుండి లక్ష కోట్లకు పెంచేశారు. ప్రాజెక్టు నాసిరకం అని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు ప్రమాదం జరిగితే భద్రాచలం మొత్తం జలమయం అవుతుంది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టొద్దంటూ ముందే నివేదిక తెలియజేసింది. మాకు ఏవిధమైన రాజకీయ దురుద్దేశం లేదు. ఎన్డీఎస్‌ఏ సూచనలు అనుసరించి ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళతాం. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారు.

ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కేసీఆరే ముఖ్యమంత్రి. ఆ పార్టీ వాళ్లు పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల కేసు ఓపెన్ చేస్తాం. గత ప్రభుత్వ తప్పిద్దాల వల్లే మేడిగడ్డ కూలిపోయిందని కమిటీ స్పష్టం చేసింది. కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు అందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కమీషన్లకు కక్కుర్తి పడి, కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లకు పెంచేశారు. ఒక క్రిమినల్‌లాగ తెలంగాణ ప్రజల జీవితాన్ని నాశనం చేశారు కేసీఆర్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేం ప్రవర్తిస్తాం కానీ, కేటీఆర్ చెప్పినట్లు కాదు. మూడు బ్యారేజిలను ఫ్రీ ఫ్లో కండిషన్లలో పెడతాం. మేడిగడ్డకు వెళ్లి మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డిపై 31 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీరందించలేదు”. అంటూ మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.