Andhra PradeshHome Page Slider

తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి ఉపయోగించారంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ పార్టీ. నేడు లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఈ వివాదంపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని సవాల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి పనులు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసిందని వైసీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఆరోపణలను మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తాను ఇలా జరగలేదని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేస్తానని, తనతో పాటు టీడీపీ నేతలు కూడా వచ్చి తప్పు జరిగిందని ప్రమాణం చేయగలరా? అని సవాల్ చేశారు.

ఇలాంటి ఆరోపణల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవిషయంపై స్పందిస్తూ, దీనికి గత టీటీడీ బోర్డే సమాధానం చెప్పాలన్నారు. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె వంటివి కలిసి ఉండొచ్చని, గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లు పరీక్షలో తేలిందని పేర్కొన్నారు టీడీపీ పార్టీ నేతలు. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.