ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చావలేదంట… బతికే ఉన్నాడంట!
LTTE చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ చనిపోయినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత, తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పజా నెదుమారన్ సంచలన ప్రకటన చేశారు. వేలుపిళ్లై ప్రభాకర్ జీవించే ఉన్నాడని, ఆరోగ్యంగా ఉన్నాడని… త్వరలో బహిరంగంగా కనిపిస్తాడని పేర్కొన్నారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)ని స్థాపించి, శ్రీలంకలో ప్రత్యేక తమిళ దేశం కోసం విస్తృతమైన గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహించిన ప్రభాకరన్, ముల్లివైకల్ వద్ద శ్రీలంక సైన్యం చేసిన ఆపరేషన్ తర్వాత మే 18, 2009న మరణించినట్లు ప్రకటించారు. అప్పుడు లంక ప్రభుత్వానికి మహీంద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రపంచ తమిళుల సమాఖ్య అధ్యక్షుడు నెడుమారన్ తంజావూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ సజీవంగా ఉన్నాడని, త్వరలో కనిపిస్తారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి సంతోషంగా ఉందన్నాడు. తమిళ ఈలం కోసం తన ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తాడన్నాడు. శ్రీలంకలో సింహళ తిరుగుబాటు తర్వాత రాజపక్స ప్రభుత్వం పతనం ప్రభాకరన్ తిరిగి రావడానికి సరైన సమయమన్నాడు.

2009లో శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ మరణాన్ని ప్రకటించిన తర్వాత, ఒక మృతదేహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఐతే అవి మోసపూరితమైనవన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. ఎల్టీటీఈ నాయకుడు ఒప్పందం ప్రకారం లొంగిపోవడానికి వచ్చినప్పుడు అంతర్జాతీయ సంప్రదాయాలను ఉల్లంఘించి కాల్చి చంపారని మరికొందరు ఆరోపించారు. ఆ ఘటన సమయంలో ప్రభాకరన్ వయసు 54 ఏళ్లు. ఐతే ప్రభాకరన్ ఇప్పుడెక్కడున్నాడన్నది మాత్రం నెడుమారన్ చెప్పలేదు.

1991లో శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో ప్రభాకరన్ ప్రధాన నిందితుడు. శ్రీలంకలోని మరికొన్ని హత్య కేసుల్లో కూడా ప్రభాకరన్‌పై అభియోగాలున్నాయి. LTTE నిషేధిత ఉగ్రవాద సంస్థగా శ్రీలంక ప్రకటించింది. అదే సమయంలో శ్రీలంక బలగాలు సైతం… పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.

