Home Page SliderInternational

ప్రతి ఐదు నిమిషాలకోసారి శీల పరీక్షా…!?

ప్రపంచంలో ప్రస్తుతమున్న దౌర్భాగ్య స్థితి ఒకర్ని ఒకరు నమ్మలేని స్థితి. వ్యక్తుల మధ్య అలాగే ఉంది. వ్యవస్థల మధ్య అలాగే ఉంది. ఇక దేశాల మధ్య కూడా అదే విధమైన దుస్థితి. ఇలాంటి తరుణంలో అమెరికా భారత్ విషయంలో మనసులో ఏమున్నప్పటికీ బయటకు మాత్రం ఓ వండర్‌ఫుల్ కామెంట్ చేసింది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలీజా రైస్, ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై నెలకొన్న ఆందోళనలను తోసిపుచ్చారు. ప్రతి ఐదు నిమిషాలకు లాయల్టీ టెస్ట్‌ చేయలేమన్నారు. ఇండియా-యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ , ఇండస్ X లో మాట్లాడుతూ, ఇండియా-అమెరికా బంధాలు శాశ్వతమైనవన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత తెలుసని ఆమె నొక్కి చెప్పారు.

” ఇరుదేశాలు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాయి. దాంట్లో ఎలాంటి సమస్య లేదు. ఇరుదేశాలకు లోతైన ప్రయోజనాలే బలమైన భాగస్వామ్యానికి దారి తీస్తాయి” అని ఆమె తేల్చి చెప్పారు. కొండిలిజా రైస్, స్టాన్‌ఫోర్డ్‌లోని హూవర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా ఉన్నారు. రష్యా సైనిక పరికరాలను ఆమె “జంక్” గా అభివర్ణించారు. ప్రధాని మోదీ మాస్కో పర్యటన, రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి కాదని ఆమె అన్నారు. భారత్‌తో సైనిక సహకారాన్ని పెంచుకోవడంలో అమెరికా నిదానంగా వ్యవహరిస్తోందని, కీలకమైన సమయాన్ని, అవకాశాలను కోల్పోయిందని ఆమె చెప్పారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఎల్లలులేని సంబంధం గురించి ప్రధాని మోడీకి తెలుసునని, ఇది భారతదేశానికి పెను సవాలుగా మారుతుందని ఆమె అన్నారు.

చైనా ఆర్థికంగా, సాంకేతికంగా అమెరికా బలమైన ప్రత్యర్థిగా మారిందన్నారు రైస్. అదే సమయంలో రష్యా గురించి పెద్దగా ఆందోళన లేదన్నారామె. రష్యా సైనిక దిగ్గజం అయినా, సాంకేతికంగా, ఆర్థికంగా అంతంతగానే ఉందన్నారు. కానీ చైనా సాంకేతికతను ప్రభావితం చేస్తోందని, ప్రపంచ నెట్‌వర్క్‌లు, సరఫరా చేయడంలో బలిష్టంగా తయారైందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడంలో రైస్ కీలక పాత్ర పోషించారు. ప్రధాని నరేంద్ర మోదీ గత మూడు నెలల్లో రష్యా, ఉక్రెయిన్‌లలో పర్యటించారు. ఉక్రెయిన్‌కు వెళ్లి అక్కడ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు. ఆ తర్వాత పుతిన్‌తో ఫోన్‌లోనూ మాట్లాడారు.