ప్రేమ వివాహం విషాదాంతం..
తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఏటుకూరు రోడ్డులో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది.
వివరాల్లోకి వెళ్తే, కొలకలూరుకు చెందిన గణేశ్ అనే యువకుడు విద్యుత్‌శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఒక యువతితో ప్రేమలో పడి, కుటుంబాల అంగీకారం లేకుండానే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ప్రేమ పెళ్లి యువతి సోదరుడికి, కుటుంబ సభ్యులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
గతంలో ఈ వివాహం నేపథ్యంలో గణేశ్ ప్రాణ భయంతో గుంటూరు నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పట్లో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిచి మాట్లాడి రాజీ ప్రయత్నం చేశారు. పరిస్థితి సద్దుమణిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో మళ్లీ విషాదం చోటుచేసుకుంది. మంగళవారం గణేశ్‌ను వెంబడించి, ఏటుకూరు రోడ్డులో అడ్డగించి యువతి సోదరుడు, మరో ఇద్దరు స్నేహితులు కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన గణేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలంలో రక్తమోడిన దృశ్యం చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
తమ కుమారుడిని కత్తులతో పొడిచి చంపారంటూ గణేశ్ తల్లిదండ్రులు విలపిస్తూ న్యాయం కోరుతున్నారు. ప్రేమ వివాహం పేరుతో మరో ప్రాణం బలైపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

