NationalTelangana

తెలంగాణలో కమలం దూకుడు..!

Share with

తెలంగాణలో కమలం దూసుకుపోతోంది… దేశమంతటా ఇదే మాట.. ఎవరి నోట విన్నా ఇదే మాట. మోదీ హ్యాట్రిక్ సాధిస్తారని సర్వేలు ఘోషిస్తుంటే… తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరుగుతోందని తాజాగా వస్తున్న సర్వేలు అంచనా వేస్తున్నాయ్. తెలంగాణలో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న అభిప్రాయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయ్. దేశంలో ఉన్న వాతావరణం ఇప్పుడు తెలంగాణలోనూ ప్రబలంగా కన్పిస్తోందన్న భావనను ఇండియా టుడే సర్వే, ఇండియా టీవీ సర్వే, ఆరా సర్వేలు కుండబద్ధలుకొట్టాయ్. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి రావడంతో… ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతోందని… హామీలు, సంక్షేమం రెంటికీ పొంతన కుదరకపోవడంతో కేసీఆర్ సర్కారు చేతులెత్తేస్తోందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏం చెబుతున్నా… చేస్తాడన్న నమ్మకం ఓటరులో కలగడం లేదన్న బలమైన అభిప్రాయం ప్రజల్లో పాతుకుపోతోంది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే ఏదైనా చేస్తాడని… ఓట్లు, సీట్లే ముఖ్యమని ఆలోచిస్తాడన్న విపక్షాల నానుడి నిజమవుతోందంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

అందుకే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకొస్తామని కమలనాథులు ఘంటా బజాయించి మరీ చెప్తున్నారు. తాజాగా వచ్చిన ఇండియా టుడే సర్వే అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 6 లోక్ సభ స్థానాల్లో గెలుస్తోందని చెప్పింది. అంటే 42 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందంది. అదే సమయంలో టీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు అంటే 56 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తోందని సర్వే తేల్చింది. అయితే టీఆర్ఎస్ డౌన్ ఫాల్ మొదలైతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదని సెఫాలజిస్టులు గత కొద్ది రోజులుగా వివరణాత్మకంగా కథనాలను వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతోందని లెక్కలు వేస్తున్నారు. ఓవైపు బీజేపీ అంతకంతకూ పెరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 3 సీట్లు.. అంటే 21 అసెంబ్లీ స్థానాలను మాత్రం హస్తం పార్టీ గెలుచుకునే ఛాన్స్ ఉందంటోంది సర్వే. ఇక మజ్లిస్ ఒక లోక్ సభ, 7 ఎమ్మెల్యేలను గెలుచుకోవడం ఖాయమన్నది మనందరికీ తెలిసిన విషయమే.

కానీ ఇక్కడే అసలు లాజిక్ ఉంది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతందంటే అటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తగ్గుతున్నాయని అర్థం చేసుకోవాలి. తెలంగాణలో బీజేపీ అతి పెద్ద పార్టీగా ఓట్ షేర్ సాధిస్తోందని ఇండియా టీవీ పక్షం రోజుల క్రితం తేల్చి చెప్పింది. ఇండియా టీవీ సర్వేలో టీఆర్ఎస్ పార్టీ 8 లోక్ సభ స్థానాల్లోనూ, బీజేపీ 6 స్థానాల్లోనూ గెలుస్తోందంది. రెండు పార్టీల మధ్య గ్యాప్ తగ్గిపోతుందన్న సందేశాన్ని ఇస్తున్నట్టయ్యింది. టీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్… 42 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతుందని… బీజేపీ ఓట్ షేర్ 20 నుంచి 39 శాతానికి పెరుగుతుందని… కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 30 నుంచి 14 శాతానికి పడిపోతుందని సర్వే చెప్పింది. వాస్తవానికి బీజేపీ తెలంగాణలో పెరుగుతున్న విషయాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నప్పటికి.. పరిస్థితి అంతలా ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. గత నెల జూన్ 13న విడుదలైన ఆరా సర్వే సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ ఓట్ షేర్ 38.88, బీజేపీ 30.48, కాంగ్రెస్ 23.71 శాతంగా ఉందని పేర్కొంది. ఆరా సర్వే సంస్థ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఆవిష్కరించిన నాటి నుంచి… వచ్చిన సర్వేలు అన్నీ కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం.