‘బావ కళ్లలో కాదు, ప్రజల కళ్లు చూడండి’..రోజా సెటైర్
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి లడ్డూ వివాదం విషయంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు అర్థం లేదన్నట్లుగా పురంధేశ్వరి మాటలున్నాయని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. మాజీ మంత్రి రోజా బావ కళ్లలో ఆనందం కాదు, ప్రజల కళ్లలో ఆనందం చూడండి పురంధేశ్వరి గారు అంటూ సెటైర్ వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కించపరిచే విధంగా, కోర్టు ధిక్కార వ్యాఖ్యానాలుగా ఆమె మాట్లాడారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయితే ఆధారాలు లేకుండా ఏమైనా మాట్లాడవచ్చన్నట్లు పురంధేశ్వరి మాట్లాడుతున్నారని విమర్శించారు విజయ సాయిరెడ్డి. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా తన సందేశాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు కూటమి లాయర్ ఏం సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారని గుర్తు చేశారు. అసలు లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న విషయాన్ని నిర్థారించకుండానే ప్రజలతో ఎలా బహిరంగంగా వ్యాఖ్యానిస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనితో ఏపీలో ప్రస్తుతం లడ్డూ వివాదం సద్దుమణిగింది. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ కూడా సైలంటయ్యింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలననుసరించి విచారణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.