పంచ్ డైలాగులతో జగన్ సర్కారును కుమ్మేస్తున్న లోకేశ్
యువగళం కార్యక్రమం ద్వారా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీని అనేకమంది సీఎంలు అభివృద్ధి చేశారని… కానీ మూడున్నరేళ్లలో ఏపీని జగన్ నాశనం చేశారన్నారు లోకేశ్. మూడున్నరేళ్లలో మంత్రులేం చేశారని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశానన్నారు. యువతకు ఈ యువగళం ఓ పెద్ద ప్లాట్ ఫాం కాబోతుందన్నారు. వేల కోట్ల విలువైన పనులు చేశా.. వేల ఉద్యోగాలు ఇచ్చాన్నారు. తనను ప్రశ్నించే మంత్రులు మూడున్నరేళ్లలో ఏం పీకారో చెప్పాలన్నారు. ఒక్క ఛాన్స్ తో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడన్నారు లోకేశ్. రైతులు ఉద్యోగులు, ప్రజలు అంతా ఈ ప్రభుత్వ బాధితులయ్యారన్నారు. జగన్ మోహన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి అని దెప్పిపొడిచారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, జగన్ జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ఉండవన్నారు. యువతను జగన్ రెడ్డి మోసం చేశారన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి… నిరుద్యోగులు ఆత్మహత్యలకు కారణమయ్యాడన్నారు.

మూడున్నరేళ్లలో జే ట్యాక్స్ ఫుల్.. జాబ్ లు సున్నా అంటూ దుయ్యబట్టారు. జాదూ రెడ్డి.. జాబ్ క్యాలెండర్ ఏమైందని లోకేశ్ ప్రశ్నించారు. ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని… జే ట్యాక్స్ కట్టలేదని అమరరాజా కంపెనీని పంపించేశారన్నారు. పరిశ్రమలన్నీ బైబై ఆంధ్రప్రదేశ్ అంటున్నాయన్నారు. వచ్చే ఎన్నికల కోసం యూత్ మేనిఫెస్టో తీసుకొస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు. ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటిస్తామన్నారు. వలసవెళ్లిన యువతను రాష్ట్రానికి రప్పించి… ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మహిళా మంత్రికి చెబుతున్నా చీర, గాజులు పంపించాలన్నారు. మీ నాయకుడిలా తల్లి, చెల్లిని బయటకు గెంటేయలేదన్నారు. మూడేళ్లలో రాష్ట్రం 67 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. జగన్ ది బుల్లెట్ లేని గన్.. తుస్సు తుస్సు గన్ అంటూ అపహాస్యం చేశారు. చెత్త పన్నుపై జగన్ ఫొటో ఉండదు.. అందుకే ఆయన పేరు జాదూ రెడ్డి అన్నారు. ఏడాదిన్నరలో చంద్రబాబు వస్తారు.. ఈ పన్నులన్నీ ప్రక్షాళన చేస్తారన్నారు. మద్యపాన నిషేధం జరగలేదు గానీ… కొత్త బ్రాండ్లు తెచ్చారన్నారు. కల్తీ మద్యం తాగిస్తూ ఆడపడుచుల పుస్తెలు తెంపుతున్నాడని విమర్శలు గుప్పించారు.

రైతు రాజ్యం చేస్తామన్న జగన్.. ఏపీని రైతులు లేని రాజ్యం చేశాడన్నారు. రైతు భరోసా ఒక జాదూ.. భరోసా కేంద్రాలు మరో జాదూ అంటూ విమర్శలు గుప్పించారు. రాయలసీమకు ఉచితంగా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామన్నారు లోకేశ్. సాగునీటి ప్రాజెక్టులను పునర్నిర్మాణం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారని… జగన్ రెడ్డి సీఎం అయ్యాక ట్రాక్టర్ ఇసుక 3 వేలు చేశారన్నారు. మన ఇసుక పక్క రాష్ట్రాల్లో దొరుకుతోందని.. లోకల్‌గా మాత్రం లభించడం లేదన్నారు. కార్పొరేషన్లన్నిటినీ నిర్వీర్యం చేశారని… జాదూ రెడ్డి పాలనలో కార్పొరేషన్ల ద్వారా బీసీలకు ఒక్క రూపాయి సబ్సిడీ వచ్చిందా అని లోకేశ్ ప్రశ్నించారు. సైకో పాలనలో దళితులను, మైనార్టీలను చంపారన్నారు. మాస్క్ ఇవ్వలేదని అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చొడ్ని చేసి చంపేశారన్నారు. జే బ్రాండ్లపై పోరాడిన ఓం ప్రతాప్‌ను రాత్రికి రాత్రే చంపి శవాన్ని ఇంటికి పంపించారన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా చేశారని… రైతుల్ని చంపడానికి జగన్ రెడ్డి ఒక స్పెషల్ లైసెన్స్ ఇచ్చినట్టున్నాడన్నారు లోకేశ్. ఎమ్మెల్సీ అనంతబాబు.. డ్రైవర్ ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారన్నారు. పేదలు ఎక్కడున్నా కండీషన్లు లేకుండా పెన్షన్లు ఇస్తామన్నారు.

సైకో పాలనలో అప్పులు, ఆత్మహత్యలు, గంజాయిలో ఏపీ నంబర్ వన్ అయ్యిందన్నారు. అశోక్ లైలాండ్, కియా కంపెనీలకు సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ అయితే బూమ్ బూమ్ లాంటి కంపెనీలకు సైకో బ్రాండ్ అంబాసిడర్ అయ్యారన్నారు. పవర్ హాలిడే, క్రాప్ హాలిడేకి సైకో బ్రాండ్ ట్రేడ్ మార్క్ అని లోకేశ్ విమర్శించారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని చేయడానికే పాదయాత్ర చేపట్టానన్నారు. సైకో పాలన అంతం చేయడానికే పాదయాత్రని… ఎన్టీఆర్ నినాదానికి కట్టుబడి ఉన్నానన్నారు. ప్రశాంతంగా ఉన్న కుప్పానికి ఇడుపులపాయ పంచాయితీ తెచ్చారని… చంద్రబాబు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కుప్పంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు కనిపించలేదన్నారు. వైసీపీ చేసిన దానికి వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తానంటూ లోకేశ్ హెచ్చరించారు. మీతో కక్కించే ప్రతి రూపాయి కుప్పంలో పేద ప్రజలకు ఖర్చు చేస్తాన్నారు. మీ జీవో నెంబర్ 1 మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోవాలన్నారు. వారాహి ఆగదు.. ఈ యువగళం ఆగదని… తమను ఎవరూ ఆపలేరన్నారు. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామంటూ జగన్ సర్కారును లోకేశ్ హెచ్చరించారు.

