పవన్ కల్యాణ్ మనసు చదివిన లోకేశ్.. ఏమన్నారంటే…
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరుపతికి చేరుకొంది. ఈ సందర్భంగా యువత ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు లోకేశ్ బదులిచ్చారు. “నూరుకు నూరు శాతం. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో… ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి… ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలి.. ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో.. వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో మొదటగా అవసరం మంచి మనసు. ఆ మంచి మనసు ఉంటే ఏమున్నా అధిగమించొచ్చు. ఆ మంచి మనసు, నేను పవన్ కల్యాణ్‌ను 2014లో కలిసినప్పుడు చూశా… ఆయనను నేను కలిసింది ఒకటే ఒకసారి. ఆనాడు నేను చూశా.. ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో మార్పు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తాపత్రయం చూశా.. అలాంటి వారు రాజకీయాల్లోకి రావాలి. అలాంటి వారు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం చాలా చాలా ఉందన్నారు. ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో.. ఒక సినిమా స్టార్‌గా గానీ, బాగా చదువుకున్నవారు గానీ, ఒక పారిశ్రామికవేత్త గానీ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సమాజంలో మార్పు తీసుకురావాలన్నా, గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా, వీళ్లు చేయగలుగుతారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా.. అందుకే సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిత కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా” అన్నారు లోకేశ్.