జనవరి 26 నుంచి లోకేష్ పాదయాత్ర..!
తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేశ్ వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించే పాదయాత్ర ద్వారా 450 రోజుల పాటు ప్రజల్లోనే ఉంటూ 2024 మార్చిలో ముగించాలని స్కెచ్ గీశారు. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న వార్తల నేపథ్యంలో అక్టోబరు 2వ తేదీన పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని లోకేశ్ తొలుత భావించారు. అయితే.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలని జగన్ భావిస్తుండటంతో లోకేశ్ తన పాదయాత్ర తేదీలను వెనక్కి జరిపారు.

కుప్పం టు శ్రీకాకుళం..
తన తండ్రి నియోజక వర్గమైన కుప్పంలో ప్రారంభమయ్యే పాదయాత్రను శ్రీకాకుళంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించారు. టీడీపీ కేంద్రీకరించిన నియోజక వర్గాల్లో ఎక్కువ రోజులు ఉంటూ.. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను ప్రజల్లో ఎండగట్టాలని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ 2024 ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి తొలి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పాదయాత్ర సందర్భంగా రోడ్ షోలు, బహిరంగ సభలు భారీగా నిర్వహించాలని లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు.

