800 కిలోమీటర్లకు చేరిన లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం నాటికి ఎనిమిది వందల కిలోమీటర్లకు చేరుకుంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామం వద్ద పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా శిలాఫలకాన్ని నారా లోకేష్ ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్తాడు గ్రామంలో చీనీ ప్రాసెసింగ్ నెలకొల్పాలని నిర్ణయించుకున్నట్లు నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం జరిగిన పాదయాత్రలో నారా లోకేష్ కు మద్దతుగా సినీనటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పాల్గొనడంతో కార్యకర్తలు అభిమానులలో జోష్ వచ్చింది. దారి వెంట భారీ ఎత్తున ప్రజలు పాదయాత్రలో పాల్గొని నారా లోకేష్ తో సెల్ఫీలు తీసుకున్నారు.

