రాహుల్ గాంధీ దుమారం వేళ.. మరో ఎంపీపై అనర్హతను రద్దు చేసిన లోక్‌సభ
లక్షద్వీప్ ఎంపీ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ తొలగించింది. NCP నేత మహ్మద్ ఫైజల్‌పై గతంలో వేసిన అనర్హతను తొలగిస్తూ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు (బుధవారం) నోటీస్‌ను జారీ చేసింది.
2009లో కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్ సలీహ్‌పై దాడి జరిపారన్న కేసులో ఈ సంవత్సరం జనవరి 10న లక్షద్వీప్ ఎంపీని కవరత్తీ కోర్టు దోషిగా తేల్చి, పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అనంతరం మూడు రోజులలోనే ఆయనను లోక్‌సభ సభ్యత్వం రద్దు చేస్తూ సచివాలయం ప్రకటన ఇచ్చింది. ఆయన కేరళ హైకోర్టుకు వెళ్లగా, కవరత్తి కోర్టు తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. అందువల్ల ఆయనకు జైలుశిక్ష పడలేదు.

కానీ, ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని మాత్రం సచివాలయం పునరుద్ధరించలేదు. దీనితో ఆయన సుప్రీం కోర్టులో కేసు వేయగా, ఈ పిటిషన్‌పై ఈ రోజే విచారణ జరగనుంది. కోర్టు తీర్పు వెలువడకుండానే నేడు ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సచివాలయం ప్రకటించడం గమనార్హం. ఇదే విధంగా రాహుల్‌కు మోదీ ఇంటిపేరును అవమానించారన్న కారణంగా రెండేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడం మనకు తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ వర్గాలు, ఇతర ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు ఫైజల్ విషయంలో జరిగిన ఈ సంఘటన రాహుల్ గాంధీపై అనర్హత విషయంలో కూడా ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

