Home Page SliderTelangana

లోక్‌సభ సమరం… బీఆర్ఎస్‌లో కలవరం..!

లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో లేని బీఆర్ఎస్
గతంలో సారూ.. కారూ.. పదహారూ నినాదం
ఇప్పుడు పార్టీలో అయోమయం
ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకురాని నేతలు
కేసీఆర్ మెదక్ నుంచి బరిలో దిగేనా?
కేటీఆర్‌ను పోటీలో దింపుతారంటూ ఊహాగానాలు

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగబోతున్న తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో అయోమయం రాజ్యమేలుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవాలన్నదానిపై ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంటే… బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. అభ్యర్థుల్ని ఖరారు చేసుకొని ఎన్నికల్లో కొట్లాడాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తుంటే.. అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తారన్నదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మరీ ముఖ్యంగా మెదక్, గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్‌లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కొట్లాడేందుకు నేతలు వెనుకంజ వేస్తున్నారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించింది. పెద్దపల్లి నుంచి బూర్లకుంట వెంకటేష్, జహీరాబాద్ నుంటి బీబీ పాటిల్, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి బి రాములు, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే ప్రస్తుతం వీరిలో కనీసం నాలుగురైదుగురికి టికెట్ నిరాకరించే అవకాశమున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి నుంచి మరోసారి బాల్క సుమన్ బరిలో దిగుతారా అన్నది చూడాలి. ఇక జహీరాబాద్ నుంచి గత ఎన్నికల్లో పాటిల్ స్వల్ప ఓట్లతో విజయం సాధించారు. మెదక్ నుంచి విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి మరోసారి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటుంటే… మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి పోటీకి దూరంగా ఉంటానని పార్టీకి చెప్పేశారని టాక్. ఇక నాగర్ కర్నూలు నుంచి విజయం సాధించిన రాములు, వరంగల్ నుంచి గెలిచిన దయాకర్, మహబూబాబాద్ నుంచి గెలిచిన కవితకు టికెట్లు ఇస్తారా ఇవ్వరా అన్న అనుమానం ఉంది. ఇక ఖమ్మం నుంచి గత ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన నామా నాగేశ్వరరావు ఈసారి పోటీ చేయడం అనుమానమేనంటున్నారు పార్టీ నేతలు.

మరోవైపు కరీంనగర్ నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కేసీఆర్ బిడ్డ కవిత పోటీ చేయడం దాదాపు ఖాయమన్న సంకేతాలొస్తున్నాయ్. మల్కాజ్‌గిరి నుంచి కేటీఆర్ బరిలో దిగుతానంటూ దీమా ప్రదర్శిస్తుంటే.. పార్టీ నేతలు వద్దంటూ వారిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్ సభ ఎన్నికలు వేరు అనవసరంగా టెన్షన్ తీసుకోవద్దంటున్నారట. ఇక మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని ఢీకొట్టడం కేటీఆర్ వల్ల అవుతుందా లేదంటే లోక్ సభకు కేటీఆర్‌ను పంపాలా అన్నదానిపై కేసీఆర్ తర్జనభర్జనపడుతున్నారట. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు వచ్చుంటే, కచ్చితంగా లోక్ సభకు కేసీఆర్, హరీష్ ఇద్దరూ పొటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఫలితాలు రివర్స్ కావడంతో ఇప్పుడు కేటీఆర్‌ను లోక్ సభకు పంపిస్తే… జాతీయ స్థాయిలో పార్టీకి ప్రచారం లభిస్తోందన్న భావనలో కూడా బీఆర్ఎస్ వర్గాలున్నాయట. అందుకే సేఫ్ సీట్ మెదక్ నుంచి కేటీఆర్‌ను బరిలో దింపే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. కేసీఆర్ లోక్ సభకు పోటీ చేయడంపైనా పార్టీ వర్గాలు సస్పెన్స్ కొనసాగిస్తున్నాయ్. కేసీఆర్ ఎంపీగా వెళ్తే, శాసనసభలో పార్టీని ముందుకు నడిపించడం, రేవంత్ ముందు కష్టమన్న వర్షన్ ప్రచారంలో ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి తాను అసెంబ్లీలో ఉంటేనే సీన్ రక్తికడుతుందని కేసీఆర్ భావిస్తుంటే.. అంత సీన్ లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం ఏం చేయాలని దానిపై బీఆర్ఎస్ తర్జనభర్జనలు పడుతోంది. దీంతో తెలంగాణ భవన్‌లో నిశ్శబ్దం ఆవరించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ఏ విధంగా ఢీకొట్టాలో అర్థం కాక కేసీఆర్ సతమతమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ పరాజయం తర్వాత బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు పెద్ద సవాలు. 2019లో కారూ.. సారూ.. పదహారు నినాదమైతే ఇప్పుడు కనీసం 6 స్థానాల్లోనైనా పార్టీ గెలుస్తుందా అన్న మీమాంశ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక స్థానాల్లో విజయం సాధించి తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడంతో ఆ పార్టీ లోక్ సభ ఎన్నికలకు పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించి దూకుడు పెంచుతోంది. కేంద్రంలో మోదీ సర్కారును గద్దె దించాలంటే తెలంగాణలో సింహభాగం సీట్లను గెలుచుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇక బీజేపీ 10 లోక్ సభ స్థానాలను టార్గెట్ చేస్తోంది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించిన పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి… ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వాలని నేతలకు సూచించారు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎలా ముందడుగేయాలన్నదానిపై గందరగోళంలో కూరుకుపోయింది. కొందరు నేతలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే, వారంతా కాంగ్రెస్, లేదంటే బీజేపీలో చేరి, పార్టీని ఓడించేందుకు ప్రయత్నించొచ్చని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.