2023 టెలి కమ్యూనికేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
డిజిటల్ ఇండియా నినాదంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టే ఉద్దేశంతో ఈ కొత్త టెలికమ్యూనికేషన్ బిల్లు రూపొందించినట్లు పేర్కొన్నారు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ బిల్లు ద్వారా దేశ రక్షణకు సంబంధించిన విషయాలలో టెలికాం సర్వీసులను కేంద్రప్రభుత్వం గమనించేలా, కంట్రోల్ చేసే వ్యవస్థ ఏర్పడిందన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే దేశంలోని ఏ టెలికాం నెట్‌వర్క్‌నైనా ప్రభుత్వం నియంత్రించవచ్చని, ప్రజల హక్కులను కాపాడుతుందని పేర్కొన్నారు. నేరాలు, ఘోరాల విషయంలో, దేశ ప్రజల భద్రత విషయంలో రాజీపడేది లేదని, పబ్లిక్ ఇంట్రస్ట్ కోసం ఎలాంటి మెసేజిలైనా, వీడియోలనైనా ప్రభుత్వం బ్యాన్ చేయవచ్చని తెలిపారు. ఈ బిల్లు ప్రకారం ఏ వ్యక్తి అయినా పూర్తి వ్యక్తిగత గుర్తింపు కార్డు లేనిదే సిమ్ కార్డు పొందడానికి వీలులేదు. అలాగే ఒకే ఐడీ నెంబరు ద్వారా 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ గ్రూప్ సిమ్ కార్డులు కూడా జారీ చేయబడవు. ఈ బిల్లును ఆమోదించిన సమయంలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు లోక్ సభలో లేరు. దీనితో కేవలం తక్కువ మంది సభ్యులతోనే ఈ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లులో పలు శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలకు స్పెక్టమ్ కేటాయింపు అడ్మినిస్ట్రేటివ్ విధానంలో జరిగేలా మార్పులు చేయబడ్డాయి.