లివింగ్ టుగెదర్ ఇకపై కఠినతరం… ఉత్తరాఖండ్ సర్కార్ కొత్త నిబంధనలు
దేశ వ్యాప్తంగా పెళ్లి, పెటాకులు లేకుండా ఇష్టానుసారంగా లివింగ్ టుగెదర్ ఉంటున్నోళ్లకు ఇక రోజులు చెల్లినట్టుగా కన్పిస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటూ బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు ఇష్టారాజ్యంగా అమ్మాయి-అబ్బాయిలు కలిసుండటం నేరం కాబోతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా ఎవరికి వారు.. నచ్చినట్టుగా ఉంటామంటూ చూస్తూ ఊరుకోమంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం శాసనసభలో ప్రతిపాదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులో సంచలనాలున్నాయి. వివాహం, విడాకులు, వారసత్వాలు, లైవ్-ఇన్ సంబంధాలకు సంబంధించి.. కఠిన చట్టాలను ప్రతిపాదించారు. నిపుణుల ప్యానెల్ ఆమోదించిన బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించారు. కలిసి జీవించేవారు… తమ సంబంధాలను నమోదు చేసుకోవడంలో విఫలమైతే, గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష, పాతిక వేల రూపాయల జరిమానా విధిస్తారు. లివ్-ఇన్ రిలేషన్ షిప్ రిజిస్టర్ చేసుకోవడంలో ఒక నెల ఆలస్యమైనా సరే… మూడు నెలల జైలు శిక్షను అనుభవించాల్సిందే. 21 ఏళ్లలోపు జంటలు కలిసి జీవించాలనుకుంటే… తల్లిదండ్రుల అనుమతి అవసరం. “ప్రజా విధానానికి, నైతికతకు విరుద్ధమైన” కలిసి జీవిస్తే వారి సంబంధాలను రిజస్టర్ చేయరు.

లైవ్-ఇన్ సంబంధాల నమోదు కోసం పరిపాలన వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు. వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన తర్వాత, అవి జిల్లా రిజిస్ట్రార్ ద్వారా ధృవీకరిస్తారు. సంబంధం చెల్లుబాటుకు విచారణ నిర్వహించి ఆమోదం తెలుపుతారు. రిజిస్టర్డ్ లైవ్-ఇన్ రిలేషన్ షిప్ రద్దుకు నిబంధనలూ కఠినంగా అమలు చేస్తారు. ఏదైనా సంబంధం, రద్దుకు జంట రాతపూర్వక ప్రకటనను సమర్పించాలి. సంబంధాన్ని రద్దు చేసుకోడానికి ఇచ్చిన కారణాలు “అనుమానాస్పదమైనవి” లేదా “తప్పు” అని రిజిస్ట్రార్ భావిస్తే, అది పోలీసు విచారణకు దారితీయవచ్చు. లివ్-ఇన్ రిలేషన్ షిప్ నుండి పుట్టిన పిల్లలు “చట్టపరమైన గుర్తింపు పొందుతారు” అని కూడా కోడ్ చెబుతోంది. ఏ బిడ్డను కూడా “చట్టవిరుద్ధం” అని చెప్పరాదు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ప్రభుత్వం నియమించిన ప్యానెల్ 749 పేజీల ముసాయిదా పత్రాన్ని సమర్పించిన తర్వాత ఉత్తరాఖండ్‌లోని UCC వచ్చింది. కోడ్‌లోని ఇతర ప్రతిపాదనలలో బహుభార్యాత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం అమలవుతుంది. అన్ని మతాలలోని బాలికలకు వివాహ వయస్సును ప్రమాణీకరిస్తారు. విడాకుల కోసం ఒకే విధానం అమల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ UCC కూడా ‘హలాలా’ మరియు ‘ఇద్దత్’ వంటి పద్ధతులను నిషేధించాలని కోరింది, ఇవి విడాకులు లేదా భర్త మరణం తర్వాత స్త్రీ తప్పనిసరిగా పాటించాల్సిన ఇస్లామిక్ పద్ధతులు.

