NewsTelangana

‘లైగర్’ పెట్టుబడులు.. కాంగ్రెస్ నేత కామెంట్స్

ఒకవైపు ఢిల్లీ లిక్కర్‌ స్కాం… మరోవైపు ‘లైగర్‌’ సినిమాలో బ్లాక్‌ మనీ పెట్టుబడి.. అంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత సన్నిహితుల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. మరోవైపు కవితపై తెలంగాణ కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ మరో బాంబు పేల్చారు. ‘లైగర్‌’ సినిమాలో కవిత బ్లాక్‌మనీని పెట్టుబడిగా పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ ఈడీ, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. లైగర్ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ తో పాటు భారీ తారాగణం ఉన్నారని, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని భారీగా నిర్మించారని వెల్లడించారు. ఇటీవల విజయ్ దేవరకొండను కవిత కలిసి తన దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు కవిత ‘లైగర్’ సినిమాలో భారీ పెట్టుబడులు పెట్టారని జడ్సన్ ఆరోపించారు. ఇది తమ ఆరోపణ మాత్రమే కాదని… దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

మరోవైపు లిక్కర్ స్కాం ఆరోపణల నిందితుడితో ఎమ్మెల్సీ కవిత దిగిన ఫోటో తాజాగా వైరల్ అవుతోంది. సీబీఐ కేసులో ఏ-14 రామచంద్రన్‌ పిళ్లై ఫ్యామిలీతో తిరుమలలో కవిత కనిపించారు. బోయినపల్లి అభిషేక్ రావుతో సహా ఆమె తిరుపతి టూ‎ర్‎కు వెళ్లారు. లిక్కర్ స్కాం నిందితుడితో ఎమ్మెల్సీ కవిత తిరుమలకు ఎందుకెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. రామచంద్రన్‌ పిళ్లైని కలవలేదని గతంలో కవిత చెప్పారని గుర్తు చేశారు. లిక్కర్ స్కాంతో సంబంధం లేదన్న కవిత.. రామచంద్రన్‌ పిళ్లైతో కలిసి తిరుమలకు ఎందుకెళ్లారని నిలదీశారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లో 5 చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. రాబిన్‌ డిస్టలరీస్‌, డైరెక్టర్‌ కార్యాలయల్లో సోదాలు జరుపుతోంది. అనుమానాస్పద బ్యాంక్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌, కర్ణాటక, చెన్నై, ఢిల్లీలోని రామచంద్రన్‌ పిళ్లై ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు.