Home Page SliderNational

చిన్ని కృష్ణున్ని ఇలా పూజిద్దాం..

ఆగస్టు 26 శ్రీకృష్ణజన్మాష్టమి. ఈ సందర్భంగా యావత్ కృష్ణభక్తులంతా భక్తి శ్రద్ధలతో జన్మాష్టమి జరుపుకుంటారు. చిన్ని కృష్ణుని విగ్రహానికి పూలు, నెమలి ఈకలతో అందంగా అలంకరించి మురిసిపోతారు. తమ చిన్ని పిల్లలకు కృష్ణుని వేషం వేసి ముచ్చట పడతారు. ఈ రోజున ఉదయం నుండి రకరకాల పిండివంటలు చేసి, సాయం సంధ్యవేళ గోపాలుడిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు చక్కటి ముగ్గు వేస్తారు. గడప నుండి పూజామందిరం వరకూ బియ్యంపిండితో చిన్ని కృష్ణుని పాదాలు వేసి, ఆ జగన్నాథుడే నట్టింట్లోకి వస్తున్నట్లు భావిస్తాం. 5 వత్తులతో దీపాన్ని వెలిగించి, ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ పూర్తి చేయాలి. కృష్ణునికి అత్యంత ఇష్టమైన వెన్న, పాలు, పండ్లు నైవేద్యంగా పెట్టాలి.

దేవాలయాల వద్ద బాలురు ఉట్టి కొట్టే ఉత్సవాన్ని ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇస్కాన్ దేవాలయంలో కృష్ణభజనలు, పూజలతో వైభవంగా పండుగ జరుపుకుంటారు. శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమినాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులందరూ హరేకృష్ణ, జై శ్రీకృష్ణ నినాదాలు చేస్తూ పరవశంతో పూజలు జరుపుకుంటారు.