దోచుకుందాం… దాచుకుందాం.. ఆ ఇద్దరూ సీఎంలు ఏకమయ్యారు…
హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పని చేస్తానని, ఈ కరీంనగ్ గడ్డ తనకెంతో ఇచ్చిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టానని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం భూమి, గ్రానైట్, సాండ్ స్కాంలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు ఏకమయ్యారని బండి దుయ్యబట్టారు. దోచుకుందాం… కమీషన్లు దాచుకుందాం అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరిస్తే జై తెలంగాణ అని నేనంటా… జై ఆంధ్రా అని నువ్వను అంటూ ఇద్దరూ సీఎంలు మాట్లాడుకున్నారన్నారు. రెండు రాష్ట్రాల నాయకుల చరిత్రను ప్రజలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీళ్లు, నిధులు, నియామకాలకు సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని.. కానీ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఏమాత్రం సహకరించడం లేదన్నారు బండి సంజయ్. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్‌లతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని… బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటిన జీతాలు ఇస్తామన్నారు. తెలంగాణ పేరుందని టీఆర్‌ఎస్‌కు 2 సార్లు ఓట్లు వేశామన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పేరుతో తెలంగాణ పదాన్ని తొలగించారని… ఇకపై టీఆర్‌ఎస్‌కు తెలంగాణతో సంబంధం లేదని బండి విమర్శించారు.