భారతీయ సాంప్రదాయాలను గౌరవిద్దాం
మన పండుగలు చాలా ఉత్సాహంగా, పెద్ద ఎత్తున జరుపుకోవాలి. కాదనడం లేదు. సంప్రదాయ సంగీత వాయిద్యాలు, సాంప్రదాయ దుస్తులు, మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి, ప్రతి హిందువుల పండుగలో మనం కనిపించాలి. అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది. కానీ ప్రస్తుతం పండుగ వచ్చిందని ని సంతోషించాలా? లేక బాధ పడాలా అర్థం కాని ఊగిలాటలో ఉండాల్సి వస్తోంది. అందునా ప్రత్యేకించి వినాయక చవితికి ఈ వైపరీత్యం ఆందోళనకలిగిస్తోంది. ప్రపంచంలోని ఏ మతం లో జరుగని జుగుప్సాకరమైన వాతావరణం ఈ వినాయక నవరాత్రులలో తాండవం కన్పిస్తోంది. ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకుంటూ, అనుకరిస్తూ ఉంటే, మనవాళ్ళు మాత్రం మత మార్పిడీలు చేసేవారు, మన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఇతర మతాల వారు వెక్కిరించేలా ప్రవర్తిస్తున్నారు.

ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలు వేసి, నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? క్రిస్మస్ రోజు ఏసుక్రీస్తు ముందు శాంతాబాయి పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా?
బొద్దులు జైన మతస్థులు తమ దేవుడి ముందు కెవ్వు కేక పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? ఈ సమాజాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత ప్రయోజనాలను గౌరవిస్తాయి. ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కాపాడుకుంటున్నారు కూడా. మరి అలాంటప్పుడు, మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ ముందు, చిత్తుగా మద్యం తాగి, ఆ మత్తులో అసభ్యకరమైన పాటలకు డీజేలు పెట్టి మరీ ఈ అసభ్య అర్థ నగ్న నృత్యాలు ఎందుకు ?
ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎవరు, ఎందుకు విధించారు లేక మనమే ఆలా చేస్తున్నామా ??? డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి, గౌరవించి, కాపాడుకోవాల్సిన మన సనాతన సంస్కృతిని మనమే అవమానిస్తున్నాం, అగౌరవపరుస్తున్నాం
ఎందుకు???

ప్రపంచానికి సంస్కృతి నేర్పిన మన ధర్మం ఇతరుల నుండి మనకు నీతులు చెప్పించుకునే స్థాయికి రాకూడదు. ఈ దౌర్భాగ్య సంస్కృతి చాపకింద నీరులా మెల్లి మెల్లిగా మిగతా పండుగలకు పారుతుంది. ఈ మధ్య తెలంగాణ సంస్కృతికి తలమానికమైన బతుకుమ్మ పండుగలో నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా…. అనే పాట లేకుండా బతుకమ్మ పండుగ జరగడమే లేదు. కోర్చున్న కొమ్మను నరుక్కునేలా వ్యవహరిస్తున్నారు కొందరు. ఇలాగే కొనసాగితే మన సంస్కృతి మన ధర్మం మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. కనీసం ఇప్పటి నుంచైనా, పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం. మన సంస్కృతిని కాపాడుకుందాం. ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం. డీజేలకు బదులుగా హిందూ భక్తి పాటలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుదాం.

ఇట్లు
మద్దికుంట శ్రీకాంత్ శర్మ
హిందూ ధర్మచక్రం సేవా సమితి

