Home Page SliderNational

క్షమాపణ చెప్పకుండా లోక్ సభలో మాట్లాడనివ్వం

క్షమాపణ చెప్పకుండా లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వరాదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఇండియాను చులకన చేసి మాట్లాడటంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే తనకు లోక్ సభలో అవకాశం ఇస్తే తానేం మాట్లాడిందో చెప్తానంటూ రాహుల్ గాంధీ నిన్న వెల్లడించారు. కానీ ముందుగా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాక మాత్రమే మాట్లాడించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో ప్రజాస్వామ్యం లేదంటూ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ స్పీచ్‌లో రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఐతే దేశంలోని వ్యవహారాలను విదేశాలకు వెళ్లి మాట్లాడటం సమంజసమా అంటూ బీజేపీ నిప్పులు చెరుగుతోంది.

లండన్‌లో భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంటే… అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇవాళ కూడా పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు వాయిదా పడ్డాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఈరోజు రాహుల్ గాంధీ రెండోసారి లోక్‌సభలో కనిపించారు. అయితే ఎలాంటి చర్చ జరక్కుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. తనపై వచ్చిన ఆరోపణలకు సభలోనే సమాధానం చెప్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేసారు. అయితే ఆయన ముందుగా క్షమాపణ చెప్పే వరకు మాట్లాడనివ్వబోమని బీజేపీ వర్గాలు తెలిపాయి.