హనుమాన్ విజయయాత్రకు ఏ సమస్యలూ రానివ్వం
ప్రతి సంవత్సరం హనుమాన్ శోభాయాత్ర హైదరాబాద్‌లో కనులపండుగగా జరుగుతుంది. ఏప్రిల్ 6 వ తేదీన జరగబోయే హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర కు తమ శాఖ ఆధ్వర్యంలో అన్ని విధాలా సహకరిస్తామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్ గారు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే హిందూ శక్తి ప్రదర్శన, వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ నాయకులతో తన కార్యాలయంలో నగర కమిషనర్ ఈ రోజు ( మంగళవారం ) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం లాగే ఈసారి కూడా తాము యాత్రకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

నిర్వాహకులు కూడా తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాత్ర విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన పలు కీలకమైన విషయాలను బజరంగీదళ్ నేతలు కమిషనర్ గారికి వివరించారు. శాంతి సామరస్యంగా పండుగలు నిర్వహించుకోవాలని, పండుగలు అంటేనే ఐక్యతకు నిదర్శమని కమీషనర్ వివరించారు.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఉగాది క్యాలెండర్ ను కమిషనర్ గారికి అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, నాయకులు రమేష్, హిమన్ సింగ్, వీరు, కిషోర్, శ్యామ్, మహేష్ యాదవ్, అఖిల్, భరత్ వంశీ, పవన్, తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్రను విశ్వహిందూ పరిషత్, బజరంగీదళ్ సంయుక్తంగా గౌలిగూడ రామ్ మందిరంలో ఏప్రిల్ 6న ఉదయం 9.30 నిముషాలకు మొదలు పెడతారు. తాడ్‌బండ్ హనుమాన్ గుడిలో పూర్తి చేస్తారు.

