Home Page SliderInternational

“తెలంగాణతో చేయి కలుపుతాం”.. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ

తెలంగాణకు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్‌లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా  చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో  భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని  ఆహ్వానించింది. పరస్పరం  అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు  ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. తెలంగాణలో స్టాన్‌ ఫోర్డ్ బయోడిజైన్ శాటి లైట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. స్టాన్‌ఫోర్డ్ అధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వారితో  పంచుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్నారు. కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.  స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్  లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే  స్కిల్స్ డెవెలప్మెంట్ లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా.. యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని అన్నారు.