ప్రజలు మెచ్చే పాలన తెచ్చుకుందాం..
భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా యువ మొర్చా ప్రశిక్షణ తరగుతులకు ముఖ్యఅతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రసంగించారు. “సమాజంలో సగం మంది అయిన మహిళలను ఎన్నికలయ్యాక కేసీఆర్ పట్టించుకోవడం లేదు. వడ్డీలేని రుణాల బాకీలు 2018 నుండి ఇవ్వడం లేదు.. 4800 కోట్ల రూపాయలు మహిళలకు బాకీ పడ్డారు. కెసిఆర్ ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేస్తున్నారు. నోటిఫికేషన్లు వేస్తున్నారు తప్ప ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో దేశంలో ఎక్కడాలేని నిబంధనలు పెట్టీ.. వారి ఆశల మీద నీళ్ళు చల్లుతున్నారు. దీనిమీద పెద్దఎత్తున పోరాడాలి. గతానికి ఇప్పటికీ వైద్యరంగంలో ఎలాంటి మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. వైద్యం విషయంలో కేసీఆర్ సంపూర్ణంగా విఫలం అయ్యాడు. హాస్టల్స్ లో నాణ్యమైన బువ్వ పెట్టడం లేదు. విషాహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. Bjym దీని మీద కొట్లాడాలి. ఎన్నికలు అనగానే కేసీఆర్ డబ్బులు కుమ్మరిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు అమ్మి.. అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారు. బీఆర్‌ఎస్ పెట్టి డబ్బులు పంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలనే నీచమైన కేసీఆర్ కుట్రలను నిలువరించాలి. కనుచూపు మేరలో అధికారం ఉంది. బీజేపీను బలోపేతం చేసుకుందాం. ప్రజలు మెచ్చే పాలన తెచ్చుకుందాం” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


